హైదరాబాద్, మహా
సూపర్ స్టార్ మహేష్ బాబుకు కోట్లాది మంది అభిమానులుండడానికి కారణం కేవలం సినిమాలే కాదు. ఆయన చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాలు కూడా. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడీ సూపర్ స్టార్. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చిన్న పిల్లలకు ఉచితంగా చేస్తోన్న గుండె ఆపరేషన్లు. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. హార్ట్ ప్రాబ్లమ్ ఉండడంతో సర్జరీ చేయించాడు. ఈ ఘటనే ఓ గొప్ప మంచి పనికి పునాది అయ్యింది. తన కుమారుడిలా మరొక పిల్లాడికి అలాంటి సమస్యలు రాకూడదని తలంపుతో గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఇప్పటివరకు వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ద్ సర్జరీలు చేయించాడీ రియల్ హీరో. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపాడు.. శుక్రవారంతో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం 5000 ఉచిత హార్ట్ సర్జరీలు పూర్తయ్యాయి. దీనితోసోషల్ మీడియాలో మహేష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నువ్వు దేవుడివి సామీ.. నీ సాయం ఇలాగే కొనసాగాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ తో అభినందిస్తున్నారు.







