Mahaa Daily Exclusive

  ఉస్మా‘నయా’..ఆసుపత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలి

Share

  • ఉస్మా‘నయా’..ఆసుపత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలి
  • ప‌నుల వేగ‌వంతానికి ఒక స‌మ‌న్వ‌య క‌మిటీ ఏర్పాటు
  • అధునాత‌న ప‌రిక‌రాలకు త‌గిన‌ట్లు గ‌దులు, ల్యాబ్‌లు, ఇత‌ర నిర్మాణాలు
  • అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
  • ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణంపై ముఖ్య‌మంత్రి ఉన్నతస్థాయి సమావేశం

హైదరాబాద్, మహా: రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూత‌న భవన నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణంపై ముఖ్య‌మంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో స‌మీక్షించారు. అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు అధునాతన వైద్య ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని, ఇందుకు సంబంధించి త‌గిన‌ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అధునాత‌న ప‌రిక‌రాల ఏర్పాటుకు త‌గిన‌ట్లు గ‌దులు, ల్యాబ్‌లు, ఇత‌ర నిర్మాణాలు ఉండాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌కు సూచించారు. ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల‌తో పాటు స్థానికుల‌కు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు.

వెంటనే ఒక స‌మ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేయాలి..
ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల వేగ‌వంతానికి వైద్య ఆరోగ్య శాఖ‌, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారుల‌తో వెంటనే ఒక స‌మ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు. ఈ క‌మిటీ క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టిస్తూ ప్ర‌తి ప‌ది రోజుల‌కోక‌సారి స‌మావేశ‌మై ఏవైనా స‌మ‌స్య‌లుంటే ప‌రిష్క‌రించుకుంటూ ప‌నులు వేగంగా జ‌రిగేలా చూడాల‌ని ఆదేశించారు. ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం పూర్తయ్యాక అక్క‌డి బందోబ‌స్తు, ట్రాఫిక్ విధుల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ముందుస్తుగానే త‌గిన ప్ర‌ణాళిక‌లు రూపొందించాలని స్పష్టం చేశారు. ఆసుప‌త్రికి వివిధ ర‌హ‌దారుల‌ను అనుసంధానించే ప్ర‌ణాళిక‌లు ఇప్ప‌టి నుంచే రూపొందించాల‌ని ఆర్ అండ్ బీ అధికారుల‌కు సూచించారు. హైద‌రాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుప‌త్రులు, మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి సంబంధించి ప్ర‌తి నిర్మాణానికి ఒక అధికారిని ప్రత్యేకంగా నియ‌మించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. నిర్మాణాల‌పై 24×7 ఆ అధికారి ప‌ర్య‌వేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని చెప్పారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

Latest