Mahaa Daily Exclusive

  రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్ట పాలన!ఆగమవుతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరముంది ….బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Share

  • రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్ట పాలన!
  • ప్రభుత్వ వైఫల్యాలు మనకు ఆయుధం
  • సునీత గోపీనాథ్ గెలుపు ప్రజలు ఖాయం చేశారు
  • కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ షీటర్‌ను చిత్తుగా ఓడించాలి
  • ఆగమవుతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరముంది
  • బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

గజ్వేల్, మహా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలకు పునరుద్ఘాటించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందని, ఇక జూబ్లీహిల్స్‌లో తన అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్‌ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞులైన జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీషీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలో సన్నాహక సమావేశం జరిగింది.

హాజరైన పార్టీ కీలక నేతలు
ఈ సమావేశంలో పోటీలో ఉన్న అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సహా, ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు… హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్,మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పాల్గొన్నారు. వీరితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల, క్లస్టర్ల ఇంచార్జులు పాల్గొన్నారు. వారిలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు,మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నేతలు, స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.

ఇప్పుడు ఎందుకు మాయమయ్యాయి..?
ఈ సమావేశం సందర్భంగా పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో… క్షేత్రస్థాయిలో ఇప్పడిదాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద అధినేత కు ఇంచార్జీలు రిపోర్ట్ చేశారు. పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించి, అధినేత కేసీఆర్ సమావేశంలో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనాకాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని అధినేత కేసీఆర్ సూచించారు