Mahaa Daily Exclusive

  జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కు సున్నా..మాజీ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్

Share

  • జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కు సున్నా..
  • ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం
  • ఫ్యామిలీ తగాదాలు పరిష్కరించుకోలేనిది మాపై విమర్శలా?
  • మాజీ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్

నిజామాబాద్, మహా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోలేదని, బీఆర్ఎస్‍ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కుటుంబ తగాదాలు పరిష్కరించుకోలేని కేటీఆర్.. కాంగ్రెస్‍పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, ముందు కవిత మాటలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. గురువారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ఆరాచక పాలన చేసింది కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారని రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా సున్నా రాబోతోందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్‌కు కర్రుకాల్చి వాత పెట్టబోతున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాలను ఈ ప్రభుత్వం సమానంగా చూస్తోందని, పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏదైనా చేసిందా అని ప్రశ్నించారు. నిజామాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తామని, రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం కేంద్రం నిధులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పాదయాత్రలు చేసినా స్వాగతిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈనెల 25 నుంచి జాగృతి జనం బాట పేరుతో కవిత రాష్ట్రవ్యాప్త పర్యటన చేయబోతున్న నేపథ్యంలో మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రజాసమస్యలపై కవిత పాదయాత్ర చేయడం సంతోషం అన్నారు. అయితే పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న ముఠాైలో కవిత లేరా అని ప్రశ్నించారు. కేబినెట్ లో మైనారిటీకి అవకాశం ఉంటుందన్నారు.