- జూబ్లీహిల్స్ బరిలో 58 మంది
- ఉప ఎన్నిక అభ్యర్థుల తుది జాబితా ఖరారు
- మొత్తం 211 నామినేషన్లు, 81 మాత్రమే చెల్లుబాటు.. మరో 23 ఉపసంహరణ
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో శుక్రవారం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్వో వెల్లడించారు. ఇంత మంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే, ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవ్వడం చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల పరిశీలనతోపాటు ఉపసంహరణ వరకు క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ ఉప ఎన్నికలో చివరకు 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు







