హైదరాబాద్, మహా : కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో 19 మందిని విగత జీవులుగా చేసిన వేమూరి కావేరి ట్రావెల్స్ అక్రమ బాగోతం తేటతెల్లం అయ్యింది. ఆ సంస్థ నిర్వహించిన ఈ బస్సు సీటింగ్ క్యారియరే కానీ స్లీపర్ సర్వీస్ కాదని తేలింది. వేమూరి కావేరి ట్రావెల్స్ పేరిట హైదరాబాద్, చెన్నై, బెంగళూరు విశాఖపట్నం రూట్‌లలో టూరిస్టు పర్మిషన్లతో పర్యాటక ప్రాంతాలకు బస్సులను తిప్పే సంస్థగా నమోదైంది. తెలంగాణకు చెందిన హెబ్రాన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ బస్సును 2018లో కొనుగోలు చేసి 2023 వరకు నిర్వహించింది. ఆ తర్వాత వేమూరి వినోద్ కమార్ ఈ బస్సును కొనుగోలు చేసి NOC తీసుకుని కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ డామన్‌లో తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడే వేమూరి కావేరి సంస్థ అక్రమానికి తెరలేపింది. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులు కొంత కఠినంగా ఉంటారన్న అంచనాతో డయ్యూ డామన్‌లో చేశారు. వాస్తవానికి ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది. డయ్యూ డామన్‌లో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న కావేరి ట్రావెల్స్ .. ఒడిశాలోని రాయగడలో ఆల్ట్రేషన్, ఫిట్‌నెస్ చేయించుకున్నారు. రాయగడ అధికారులు ఆల్ట్రేషన్, ఫిట్‌నెస్ మంజూరు చేసేటప్పుడు బస్సు సామర్థ్యం, సీటింగ్ వివరాలను స్పష్టంగా పొందుపరిచారు. కేవలం ప్రమాదానికి గురైన బస్సుకు 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. కానీ కావేరి ట్రావెల్స్ సంస్థ స్లీపర్ క్యారియర్‌గా మార్చింది. ఇలా మార్చడం బస్సు సామర్థ్యాన్ని అధిగమించడమే. డయ్యూ డామన్‌లో సీటింగ్ సామర్ధ్యం ఉన్న బస్సు రవాణా పన్ను ఒక్క సీటుకు రూ.450 మాత్రమే అదే స్లీపర్ సీటు అయితే రూ.800 అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఛార్జీలు చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీటుకు రూ.4500 పన్ను చెల్లించాలి. అదే స్లీపర్ సీటుకు అయితే రూ.12వేల చొప్పును ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఇలా ట్యాక్స్‌లను ఎగవేసేందుకే వేమూరి కావేరి ట్రావెల్స్ సంస్థ అక్రమ రిజిస్ట్రేషన్, ఆల్ట్రేషన్ చేయించింది.







