- రెండు లక్షలు తీసుకుంటూ తన ఇంట్లో చిక్కిన అవినీతి అధికారి
మంచిర్యాల, మహా : మంచిర్యాల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కి మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ తన నివాసంలో శనివారం రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టిబడిన వైనం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ఒకవైపు అవినీతి ప్రభుత్వ అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టులు చేస్తూ జిల్లావ్యాప్తంగా హడలెత్తిస్తుంటే అవినీతి అధికారులు మాత్రం డోంట్ కేర్ అంటున్న చందంగా వ్యవహారాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే… మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్ కొమరం భీమ్ (ఆసిఫాబాద్) జిల్లాకు ఇన్చార్జి గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే బెజ్జూర్ పిఎసిఎస్ లో విధులు నిర్వహించిన మాజీ సీఈవో వెంకటేశ్వర్ గౌడ్ ను తిరిగి విధులలోకి తీసుకునేందుకు మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ కార్యాలయంలో కలిసినట్లు తెలుస్తోంది. అందుకు గాను బిక్కు నాయక్ 7 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. తన చేతిలో అంత డబ్బులు లేవు తర్వాత ఇస్తానని ఎంతగా చెప్పినా వినకపోవడంతో చివరికి బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. వారి సలహా మేరకు ఏడు లక్షల రూపాయలు రెండు దఫాలుగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెళ్లడవుతోంది. అందులో భాగంగా మొదటి దపాగ బాధితుడు రెండు లక్షల రూపాయలు మంచిర్యాల మున్సిపాలిటీ ఇక్బాల్ నగర్ లో అధికారి నివాసానికి వెళ్లి ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా బిక్కు నాయక్ ను పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. కేసు సంబంధించిన పూర్వాపరాలు అధికారులు వెల్లడించవలసి ఉంది.







