Mahaa Daily Exclusive

  కన్నుల పండుగలా.. కార్తీక దీపోత్సవం..ఎండోమెంటు అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం

Share

కన్నుల పండుగలా.. కార్తీక దీపోత్సవం
రాష్ట్రంలోని ప్రతి దేవాలయం దీపాలతో అలంకరించి
ఎండోమెంటు అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
రాష్ట్రంలోని అన్ని ఆలయాల ఈవోలతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, మహా: కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండుగలా నిర్వహించాలని.. రాష్ట్రంలోని ప్రతి దేవాలయం దీపాలతో అలంకరించాలని ఎండోమెంట్ ఉన్నతాధికారులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. కార్తీక దీపోత్సవం ఈ నెల 22 నుంచి వచ్చే నెల 19 వరకు నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ఎండోమెంటు ఉన్న‌తాధికారులు శైలజ రామయ్యర్, హరీష్, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, అసిస్టెంటు క‌మిష‌న‌ర్లు, ఈవోలతో మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా రివ్యూ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని దేవాల‌యాల ఈవోలు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కార్తీక మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదని గుర్తు చేశారు.

కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా..
ఈ కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం చాలా శుభప్రదంగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. సామూహిక కార్తీక దీపోత్సవం అంటే అందరూ కలిసి దేవాలయ ప్రాంగణములో దీపాలను వెలిగించి భక్తి భావంతో పూజలు చేయాలని గుర్తు చేశారు. గతంలో నిర్వహించినట్లుగా ఈ సంవత్సరం కూడా సామూహిక కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ చేసే ఏర్పాట్లను మంత్రికి అధికారులు వివ‌రించారు. ప్రతిరోజు సామూహిక కార్తీక దీపోత్సవం సా. 6.00 గం.ల నుండి జ‌ర‌పాల్సి ఉంటుంద‌ని ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు మట్టి ప్రమిదలు, వత్తులు, నూనెతో పాటుగా పసుపు, కుంకుమ తాంబూలాలను మహిళా భక్తులకు అందచేస్తున్నట్టు వివరించారు. స‌మావేశంలో ఎండోమెంట్ ప్రిన్స్ ప‌ల్ సెక్ర‌ట‌రీ శైల‌జా రామ‌య్య‌ర్, డైరెక్ట‌ర్ హ‌రీష్‌, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్లు, సూప‌రింటెండెంట్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest