Mahaa Daily Exclusive

  త్వరలో అంగన్వాడీల్లో 14 వేల ఉద్యోగాలు:మంత్రి సీతక్క

Share

  • త్వరలో అంగన్వాడీల్లో 14 వేల ఉద్యోగాలు
  • టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టబోతున్నాం: మంత్రి సీతక్క
  • గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలు అందజేత

హైదరాబాద్, మహా: రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలను మంత్రి సీతక్క స్వయంగా అందజేశారు. ‘వేల మందితో పోటీపడి మీరు సాధించిన ఈ కొలువులు మీ కష్టానికి ప్రతిఫలం. మీ నిరీక్షలు ఫలించాయి, మీ ఉద్యోగ కలలను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చింది’ అని సీతక్క పేర్కొన్నారు. అంగన్వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ‘ఐసీడీఎస్ సేవలకు ఈ దేశంలో ఇందిరా గాంధీ ప్రాణం పోశారు. మహిళలకు గౌరవం, చిన్నారులకు సంరక్షణ కలగాలని ఆమె ప్రారంభించిన అంగన్వాడీ సేవలు తెలంగాణ నేల నుంచే బీజం వేశాయి. 1970లో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాయి.

ఈ పదవులన్నీ ఇందిరా గాంధీ చలువే..
అంగన్వాడీ హెల్పర్‌ నుంచి మహిళా శాఖ సెక్రటరీ వరకు ఈరోజు ఉన్న పదవులన్నీ ఇందిరా గాంధీ చలువే. ప్రతి మహిళ ఆమెకు రుణపడి ఉండాలి’ సీతక్క పేర్కొన్నారు. తెలంగాణలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. “అంగన్వాడీ చిన్నారుల పట్ల కేవలం సానుభూతి కాకుండా సహానుభూతి అవసరం. అంగన్వాడీ సిబ్బందికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాం. త్వరలో 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టబోతున్నాం” అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest