Mahaa Daily Exclusive

  వేటు ఖాయం.. ఉప ఎన్నికలు తథ్యం:కేటీఆర్‌

Share

  • వేటు ఖాయం.. ఉప ఎన్నికలు తథ్యం
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలి
  • జూబ్లీహిల్స్ మూడోసారి గులాబీ జెండా ఎగరేద్దాం
  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో నాయకులందరూ కలిసికట్టుగా పని చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ నగరంలో బీఆర్‌ఎస్‌ ఉన్న అపూర్వమైన బలాన్ని ఈ ఉప ఎన్నికలో చాటాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. “హైదరాబాద్‌ నగర ప్రజలు మన పార్టీ పట్ల అద్భుతమైన నమ్మకాన్ని చూపించి వందకు వందశాతం సీట్లను గత ఎన్నికల్లో మన పార్టీకే కట్టబెట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి” అని ఆయన అన్నారు. నగర నాయకులకు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు హైదరాబాద్‌ సమస్యలపై అవగాహన ఉందని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నగరం కోసం గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన కృషి, చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని సూచించారు. “మన ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ నగరంలోని ప్రతి గల్లీలో రహదారుల నిర్వహణ నుంచి మొదలుకొని ఎస్ఆర్‌డీపీ ద్వారా చేపట్టిన అద్భుతమైన ఫ్లై ఓవర్లు, 20వేల లీటర్ల ఉచిత తాగు నీటి పథకం, ఆటంకాలు లేకుండా నీటి సరఫరా, అద్భుతమైన పారిశుద్ధ్య నిర్వహణ, ప్రతి ఒక్కరికి అందిన అభివృద్ధి సంక్షేమ ఫలాల వరకు అన్నింటిని ప్రజలకు వివరించాలి” అని ఆయన దిశానిర్దేశం చేశారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ గెలిస్తే, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తామని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. “ఇప్పటికే రెండుసార్లు జీహెచ్‌ఎంసీ పైన గులాబీ జెండా ఎగిరింది. మూడోసారి కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయం” అని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక మాత్రమే కాదని, హైదరాబాద్‌ నగరంలో రానున్న రోజుల్లో పార్టీ మారిన ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు కచ్చితంగా పడుతుందని, ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్‌ అన్నారు. వీటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని తెలిపారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నిక విజయం ఖాయమని, అయితే మెజార్టీ కోసం మనం మరింత కష్టపడాలని కేటీఆర్‌ నాయకత్వానికి సూచించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు ఓటు వేసేలా ప్రజలకు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని కోరారు.

Latest