- హామ్ టెండర్లలో రూ. 8 వేల కోట్ల స్కామ్
- ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం లూటీ చేస్తోంది
- మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు
హైదరాబాద్, మహా: ఇందిరమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి ,పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఓ పని టెండర్‌కు సంబంధించి మంత్రుల మధ్య వివాదం తలెత్తితే సీఎం ఇద్దరినీ కూర్చో బెట్టి వాటాలు పంచారని ఎద్దేవా చేశారు. డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని గన్ పెట్టి బెదిరించారని ఇందులో సీఎం పాత్ర ఉందని మంత్రి కూతురే ఆరోపించారని గుర్తు చేశారు. మద్యం సీసాల హోలోగ్రాం కుంభకోణంలో సీఎం మంత్రి వివాదంలో అధికారిని బలి చేశారని మండిపడ్డారు. తాజాగా హామ్ పేరుతో మరో స్కామ్‌కు పాల్పడనట్టు ఆరోపించారు. హైబ్రిడ్ అన్యుటీ మోడ్ టెండర్లలో 8 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు ప్రశాంత్ రెడ్డి. హమ్‌లో కిలోమీటర్‌కు 85 శాతం అంచనా వ్యయం పెంచారని తెలిపారు. తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పూర్తి అయ్యే రోడ్లకు పదిహేడు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 8 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం లూటీ చేస్తోందన్నారు.
సీఆర్ఎఫ్ కింద కిలోమీటర్ కు కోటి 75 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, హామ్ కింద ఇచ్చిన టెండర్లలో కిలోమీటర్‌కు మూడు కోట్ల 30 లక్షల రూపాయలు ఖర్చవుతుందని గుర్తు చేశారు. సీఆర్ఎఫ్ కింద ఇచ్చిన రోడ్ల పనుల టెండర్ల జీవో,హమ్ జీవో కేవలం పది రోజుల తేడాలో వచ్చాయని జీవోలను వేముల చూపించారు. సీ ఆర్ ఎఫ్ కింద ఇచ్చిన జీవోలో కిలో మీటర్ కు ఓ రేటు ,హామ్ జీవోలో కిలోమీటర్ కు మరో రేటు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. హమ్ రోడ్ల టెండర్లు దక్కించుకున్న వారికి పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ప్రభుత్వం చెల్లిస్తోందని అన్నారు. ఈ పదిహేడు వేల కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎవరి జేబుల్లోకి వెళ్తాయో అందరికీ తెలుసన్నారు. హమ్ కింద కిలోమీటర్ రోడ్డుకు మెయింటెనెన్స్ కు మరో 2.5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని, అంటే కిలో మీటర్ రోడ్డుకు హామ్ కింద 6 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని పేర్కొన్నారు.







