Mahaa Daily Exclusive

  దూసుకొస్తున్న మొంథా.

Share

  • దూసుకొస్తున్న మొంథా
  • తెలంగాణపై ఎఫెక్ట్.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
  • రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

హైదరాబాద్, మహా: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా శనివారం భారీ వర్షం కురిసింది. అయితే బంగాళాఖాతంలో కొనసాగుతనున్న వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ… రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, దీనికి మొంథా తుపానుగా నామకరణం చేశారు. అయితే ఈ ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాల్లో అక్టోబర్ 27 నుంచి 29 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్టుగా తెలిపారు. తెలంగాణలో రాబోయే ఐదు రోజుల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఆదివారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.

రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
నేడు (ఆదివారం) ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాకు ఎల్లో అలర్ట్ జారి చేసింది. సోమవారం (అక్టోబర్ 27) రోజున రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాకు ఎల్లో అలర్ట్ జారి చేసింది

Latest