- రొమ్ము క్యాన్సర్ సమాజాన్ని పట్టిపీడిస్తోంది
- గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన క్యాంపులు నిర్వహించాలి
- బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సులో మాట్లాడిన మంత్రి సీతక్క
హైదరాబాద్, మహా: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సు ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభతో పాటు పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది, సామాన్య ప్రజలు పాల్గొన్నారు. సదస్సులో మంత్రి సీతక్క మాట్లాడుతూ “రొమ్ము క్యాన్సర్ సమాజాన్ని పట్టిపీడిస్తోంది. కానీ దాన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారించడం చాలా సులభం. ప్రస్తుతం అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ రాగానే జీవితం ముగిసిందనే భయాలు అవసరం లేదు. క్యాన్సర్ పేషెంట్లకు వైద్యులు విశ్వాసం కల్పిస్తే, దానిని జయించడం సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు.
“క్యాన్సర్‌పై ప్రజలకు మరింత అవగాహన కల్పించడం అత్యవసరం. వైద్యులు ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండాలి. యశోద ఆసుపత్రి ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమైన విషయం. కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన క్యాంపులు నిర్వహించాలి. అప్పుడే వైద్య వృత్తి సార్థకమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్యశాఖల ద్వారా గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించడం ద్వారా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలకు వైద్యులు తోడ్పాటు అందించాలి” అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధమాన నటి డా. శ్రీలీల, యశోద హాస్పిటల్ డైరెక్టర్ ఫాల్గుణ గోరుకంటి, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డా. లింగయ్య, అంకాలజీ విభాగం అధిపతి డా. రాజేష్, ఇతర వైద్య ప్రముఖులు పాల్గొన్నారు








