- కుమురం భీమ్ తరతరాలకు స్ఫూర్తి
- 40 ఏళ్లే బతికినా ప్రజలపై చెరగని ముద్ర
- స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వండి
- జీఎస్టీ మార్పు అన్ని వర్గాల్లో సంతోషం నింపాయి
- 127వ మన్‌కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ, మహా: తెలంగాణ పోరాట వీరుడు కుమురం భీమ్‌కు ప్రధాని మోదీ నివాళి అర్పించారు. నిజాం పాలనపై ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. 127వ మన్‌కీ బాత్ ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడారు. మోదీ జీఎస్టీ సవరణల ప్రస్తావన చేస్తూ, ఇటీవల జరిగిన మార్పులు పండుగ సీజన్‌లో ప్రజలందరికీ ఆర్థిక సంతోషాన్ని తెచ్చాయని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో దేశీయ ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. అదేవిధంగా, వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని చేసిన పిలుపుకు ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది అని వెల్లడించారు. ఇది ఆరోగ్యానికి, పర్యావరణానికి రెండింటికీ లాభదాయకమని మోదీ పేర్కొన్నారు.
అంబికాపుర్‌లో గార్బేజ్ కేఫ్ భేష్..
దేశ ప్రజలకు ఛత్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఛత్ ఉత్సవాన్ని భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటిగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగ వేడుకల్లో పాల్గొని, ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని కుటుంబ సభ్యులు, సమాజంతో పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జీఎస్టీలో మార్పులు ఈ సారి పండుగ సీజన్లో అన్ని వర్గాల్లో సంతోషాన్ని తీసుకువచ్చాయని ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌లో గార్బేజ్ కేఫ్ వినూత్నంగా పర్యావరణానికి సేవలు అందిస్తోంది. అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను ఇచ్చి ఫుల్ మీల్స్ తినొచ్చు. మీరు కిలో వ్యర్థాలు ఇస్తే.. లంచ్ లేదా డిన్నర్ ఏర్పాటు చేస్తారు. అదే అర కిలో ఇస్తే.. అల్పాహారం ఇస్తారు. ఈ కేఫ్‌ను అంబికాపుర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది’’ అని ప్రధాని అభినందించారు.
కుమురం భీమ్‌కు ప్రధాని నివాళి..
తెలంగాణ పోరాట వీరుడు కుమురం భీమ్‌కు ప్రధాని మోదీ నివాళి అర్పించారు. నిజాం పాలనపై ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. ‘‘భారత్‌ను దోచుకోవడానికి బ్రిటిష్ పాలకులు అన్ని మార్గాలను వాడారు. ఆ సమయంలో హైదరాబాద్ ప్రజల ప్రతిస్పందన వీరోచితంగా ఉంది. బ్రిటిష్ వారు నిజాం పాలనను బలపరిచారు. పేదలు, గిరిజనులపై నాడు జరిగిన వేధింపులు వర్ణనాతీతం. ప్రజల భూములను సీజ్ చేశారు. అలాంటి కష్టకాలంలో 20 ఏళ్ల కుర్రాడు ఆ అన్యాయాలకు ఎదురొడ్డి నిలబడ్డాడు. అతడి పేరు చెప్పబోయే ముందు.. ఆ కుర్రాడి వీరత్వం గురించి తెలుసుకోండి. నాటి రోజుల్లో నిజాంపై ఒక్కమాట మాట్లాడటం కూడా నేరమే. కానీ, ఆ కుర్రాడు నిజాం అధికారి సిద్ధిఖీని బహిరంగంగానే సవాల్ చేశాడు. అతడిని మట్టుబెట్టాడు. అరెస్టును తప్పించుకొన్నాడు. అక్కడి నుంచి అతడు అస్సాం చేరుకొన్నాడు. ఆ యువ వీరుడి పేరు కుమురం భీం. ఆయన జయంతిని అక్టోబర్ 22న నిర్వహించారు. కేవలం 40 ఏళ్లే బతికినా.. ప్రజలపై చెరగని ముద్ర వేశారు. నిజాంకు చాలా కాలంపాటు సవాలుగా నిలిచారు. 1940లో నిజాం సైనికులు ఆయన్ను హత్య చేశారు. ఆయన గురించి తెలుసుకునేందుకు యువత వీలైనంత ప్రయత్నించాలని కోరుతున్నాను’’ అని మోదీ అన్నారు








