టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన ఫోటోలు, వాయిస్‌ను మార్ఫ్ చేసి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రూపొందించిన అశ్లీల డీప్‌ఫేక్ వీడియోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోలు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని గుర్తించిన ఆయన, వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరంజీవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం పెరగడంతో సెలబ్రిటీలు ఇలాంటి డీప్‌ఫేక్ సమస్యల బారిన పడుతున్నారు. గతంలో అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్నా వంటి ప్రముఖులు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు.
ఈ వ్యవహారంపై చిరంజీవి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా తన పేరు, వాయిస్, ఫొటో, మెగాస్టార్, చిరు వంటి గుర్తింపులను డీప్‌ఫేక్, వాయిస్ క్లోనింగ్ లేదా ఇతర AI దుర్వినియోగానికి వాడకూడదని ఆయన కోర్టును కోరారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చిరంజీవి అనుమతి లేకుండా ఏఐ దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ చర్య ద్వారా సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యత మరియు ప్రతిష్టను కాపాడటానికి సైబర్ క్రైమ్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతరులు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు.







