కరీంనగర్, మహా : తెలంగాణ కేబినెట్ లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని ఇబ్బంది పెడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. అలాంటి మంత్రులను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎంఐఎంకు చెందిన రౌడీషీటర్లు పోలీసులను చంపినా, హత్యాయత్నం చేసే స్థాయికి పెట్రేగిపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందన్నారు. జూబ్లీహిల్స్‌లో ఒకవర్గం ఓట్ల కోసం ఎంఐఎం కాళ్లు పట్టుకునే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావాలంటే యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయి పటేల్150 జయంతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో సోమవారం కరీంనగర్‌లోని మేరా యువ భారత్ కార్యాలయంలో మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కేబినెట్‌లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను రాత్రిపూట ఇండ్లకు, ఆఫీసులకు పిలిపించుకుని వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కష్టపడి చదువుకుని ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్న మహిళలను గౌరవించాల్సింది పోయి అవమానించేలా వ్యవహరించడం సరికాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే విచారణ జరిపించి నివేదిక తెప్పించుకోవాలి. బాధ్యులైన మంత్రులను బర్త్ రఫ్ చేయాలి. ఇప్పటికే కాంగ్రెస్ పాలన అంటేనే మహిళలు అసహ్యించుకునే పరిస్థితి ఉంది. అవినీతి, అరాచకాలు జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారు. ముఖ్యంగా మహిళలకు ప్రతినెలా రూ.2500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తానని మోసం చేశారు. వీటికి తోడు శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. సాక్షాత్తు పోలీసులపై దాడులు చేస్తున్నరు. మొన్న నిజామాబాద్‌లో మజ్లిస్ రౌడీషీటర్ కానిస్టేబుల్‌ను చంపేశారు. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున డీసీపీ చైతన్య, కానిస్టేబుల్‌పై ఎంఐఎం రౌడీషీటర్ దాడి చేసి హత్యాయత్నం చేసినా దిక్కు లేదు. గోరక్షులపై కాల్పులు జరిపి చంపేందుకు యత్నిస్తున్నారు. మేం బాధితులకు అండగా వెళ్లి పోలీసులను పరామర్శిస్తే.. మజ్లిస్ నేతలు మాత్రం రౌడీషీటర్లను పరామర్శిస్తూ వారికి కొమ్మ కాస్తున్నారు. ఎంఐఎం ఓట్ల కోసం జూబ్లీహిల్స్‌లో గెలవడానికి ఆ పార్టీ కాళ్లు మొక్కుతున్నారు. ఆనాడు బీఆర్ఎస్ కూడా ఎన్నికల్లో గెలిచేందుకు కాళ్లు మొక్కిన దుస్థితి. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడల్లా ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయే శాంతి భద్రతలు పట్టడం లేదు. అందుకే ఆ పార్టీల కోసం ఒవైసీ బిహార్‌ను వదిలి జూబ్లీహిల్స్‌లో తిష్టవేసి ముస్లిం ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నారు. అని సంజయ్ మండిపడ్డారు.
ఓట్ల రాజకీయం
కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల రాజకీయం మానుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు. డీసీపీ చైతన్యపై హత్యాయత్నం చేసిన రౌడీషీటర్‌పై కఠినాతి కఠినంగా చర్యలు తీసుకోవాలి. యూపీ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలి. అక్కడ రౌడీషీటర్లకు బెయిల్ వచ్చినా బయటకు రాకుండా జైల్లోనే ఉండే పరిస్థితి. అట్లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రౌడీషీటర్లను కంట్రోల్ చేయాలని అన్నారు.







