Mahaa Daily Exclusive

  జూబ్లీహిల్స్ నేడు కమలం ప్రచార దండయాత్ర

Share

  • జూబ్లీహిల్స్ నేడు కమలం ప్రచార దండయాత్ర
  • కార్పెట్‌ బాంబింగ్‌ పేరుతో అగ్రనేతలంతా రంగంలోకి
  • ఒకేసారి 40మంది స్టార్ క్యాంపెయినర్లు.. సీఎంలు, ఎంపీలు

హైదరాబాద్‌, మహా : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ సంచలన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాజకీయాల్లో మొదటిసారిగా మంగళవారం కార్పెట్‌ బాంబింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పార్టీ స్టార్‌ క్యాంపెయినర్స్, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్, శాసన సభ, శాసన మండలి సభ్యులు, ఇతర ముఖ్య నాయకులంతా ఒకేసారి నియోజకవర్గాన్ని చుట్టుముట్టనున్నారు. ప్రచార దండయాత్ర చేపట్టనున్నారు. ప్రచార కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో గల్లీగల్లీ బీజేపీ నేతలతో కిక్కిరిసిపోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రచారంలో వెనుకబడ్డారన్న ఆరోపణలను పటాపంచలు చేయాలని భావిస్తోంది. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు నేతలంతా జూబ్లీహిల్స్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది. కుండపోత వర్షానికి క్లౌబ్‌ బరెస్ట్‌ అన్నట్లు రాజకీయాల్లో ఒక్కసారిగా అలాంటి ప్రభావంతమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కార్పెట్‌ బాంబింగ్‌ అంటారు. ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో స్టార్‌ క్యాంపెయినర్స్‌ 40 మందితో పాటు రాష్ట్ర నేతలందరూ ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ నేతలతో నియోకవర్గ వీధులన్నీ కిక్కిరిసిపోవడం ఖాయమని నేతలు పేర్కొంటున్నారు. దీని ప్రభావం అభ్యర్ధి దీపక్ రెడ్డికి ఎలా కలిసొస్తుందో చూడాలి.

Latest