- తెలంగాణలో ముగిసిన మద్యం షాపుల డ్రా
- రాష్ట్ర వ్యాప్తంగా 2620 షాపులకు డ్రా
- వైన్స్ టెండర్లలో సంగారెడ్డి యువకుడి హ్యాట్రిక్
- ఖజానాకు కాసుల గలగఅ
హైదరాబాద్, మహా : తెలంగాణలో మద్యం షాపుల డ్రా ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 షాపులకు సోమవారం అధికారులు, కలెక్టర్ల సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రా తీశారు. హైదరాబాద్, సికింద్రాబాద్లో 179 మద్యం షాపులకు డ్రా ముగిసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త వైన్స్ షాపుల నిర్వహణ కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో మద్యం షాపులు దక్కించుకునేందుకు ఎక్కువమంది సిండికేటై టెండర్లు వేశారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారంపై నెగిటివ్ ప్రచారం జరుగుతుండడంతో యువకులు, వ్యాపారులు మద్యం వ్యాపారంపై ఎక్కువగా కన్నేశారు. పలుచోట్ల గ్రూపుగా ఏర్పడి ఎక్కవగా దరఖాస్తులు వేశారు. గ్రూపుగా కావడంతో పాటు ఫీజు పెంపు కారణంగా దరఖాస్తులు తగ్గినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం రూ.3లక్షలు ఫీజు పెట్టిన విషయం తెలిసిందే. ఎంపికైన దరఖాస్తు దారులు అదే రోజు గానీ, మరుసటి రోజు గానీ షాప్ ఎక్సైజ్ పన్ను మొదటి వాయిదాను చెల్లించి షాపు కేటాయింపు నిర్ధారణ లేఖ తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
హ్యాట్రిక్ కొట్టిన సంగారెడ్డి రాజేశ్వర్ గౌడ్
ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వైన్స్ టెండర్ల లక్కీ లాటరీలో సంగారెడ్డికి చెందిన వ్యక్తికి అదృష్టం వరించింది. ఒక్కడికే 3 వైన్ షాపులు దక్కి హ్యాట్రిక్ కొట్టాడు. సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్ సిండికేట్గా సంగారెడ్డి పట్టణంలోని మొత్తం 24 షాపులకు టెండర్లు వేశారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి జెఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన ఎక్సైజ్ శాఖ లక్కీ లాటరీలో రాజేశ్వర్ గౌడ్కి షాప్ నెంబర్ 1, 3, 8 లాటరీ ద్వారా దక్కాయి. అయితే వీరంతా సిండికేట్గా సంగారెడ్డిలోని అన్ని షాపులకు కలిపి దాదాపు 100 వరకు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ఏకంగా మూడు షాపులు రాజేశ్వర్కి దక్కడంతో అతను సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు







