- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
- 8వ పే కమిషన్ టీఓఆర్‌కు క్యాబినెట్ పచ్చజెండా
- జీతాలు, పెన్షన్లు పెంచేందుకు వీలుగా వేతన సంఘం ఏర్పాటు
ఢిల్లీ, మహా: లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల అలవెన్సులు, పెన్షన్లను సవరించే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 8వ కేంద్ర పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కమిషన్‌లో ఎవరెవరు ఉండాలి? ఉద్దేశం, టైమ్‌లైన్‌ను ఖరారు చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ధృవీకరించారు. కొత్త వేతనాలు 2026 జనవరి నుంచి అమలులోనికి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని 48 లక్షల మంది ఉద్యోగులుకు, 67 మంది పెన్షనర్లకు ఇవి లబ్ధి కలిగించనున్నాయి. వివిధ రాష్ట్రాల పీఆర్సీలను సైతం ఇవి ప్రభావితం చేయనున్నాయి. గత ఏడవ సీపీసీ 2016లో అమలు చేశారు. అప్పటి నుంచి ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, వినిమయ ధోరణలు గణనీయంగా మారిపోయాయి. దీంతో వేతనాలు సవరించాలని చాలా కాలం నుంచి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
18 నెలల్లో నివేదికను ఇవ్వనుంది..
ప్రస్తుత వేతన స్లాబులు, అలవెన్స్, గ్రేడ్ పే వ్యవస్థలు, పెన్షన్ ఫార్ములాలు, ఇతర ఆర్థిక విషయాలపై కమిషన్ పరిశీలన జరుపుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. సూక్ష ఆర్థిక వాస్తవాలు, విత్త పరిగణనలు, ఉద్యోగాల కోసం నెలకొన్న పోటీ తదితరాలను కూడా కమిషన్ పరిశీలిస్తుందని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం కాలపరిమితి 2026 సంవత్సరంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త వేతన సవరణలను అమలు చేసేందుకై 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర సిద్ధమైంది. దీనిపై జనవరి నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖలు, అధికారులతో చర్చోపచర్చల అనంతరం 8వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ కమిషన్ తన నివేదికను 18 నెలల్లో ఇవ్వనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు







