- ప్రశాంత్ కిషోర్‌కు ఈసీ షాక్
- రెండు రాష్ట్రాల్లో ఓట్లు.. ఈసీ నోటీసులు
- ఎన్నికల వేళ చిక్కుల్లో జన్ సురాజ్ పార్టీ చీఫ్
బీహార్, మహా: ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ రెండు రాష్ట్రాల్లో ఓటరుగా ఉన్నారు. ఒక ఓటు బీహార్‌లో ఉండగా.. మరో ఓటు పశ్చిమబెంగాల్‌లో ఉంది. ఎన్నికల అధికారులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌ను చిక్కుల్లో పడేసింది. ప్రశాంత్ కిషోర్ కోల్‌కతాలోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నారు. అది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి సొంత నియోజకవర్గం. నియోజవర్గంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆయన అడ్రస్‌గా పేర్కొన్నారు. బీ రాణీశంకరీ రోడ్‌లోని సెయింట్ హెలెన్ పోలింగ్ స్టేషన్‌లో ఆయనకు ఓటు ఉందని అధికారులు తెలిపారు. 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేశారు. అప్పుడే ఆయన ఓటరుగా నమోదయ్యారు. ఇక బీహార్లోని ససారామ్ నియోజకవర్గంలో కూడా ప్రశాంత్ కిషోర్ ఓటరుగా ఉన్నారు. కోనార్‌లోని మధ్య విద్యాలయ పోలింగ్ కేంద్రంలో ఆయనకు ఓటు ఉందని అధికారులు వెల్లడించారు.







