- జీసీసీల రాజధానిగా హైదరాబాద్
- మా పాలన నమ్మకానికి ప్రతీక మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్
- నెహ్రూ, పీవీ, మన్మోహన్ సింగ్‌ల దూర దృష్టితో హైదరాబాద్‌కు బలం
- మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, మహా: తెలంగాణ ప్రతిభపై విశ్వాసం పరిపాలనపై నమ్మకానికి మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ఒక ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి టీహబ్ సమీపంలో మ్యాక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్‌ను ప్రారంభించిన అనంతరం భట్టి ప్రసంగించారు. తెలంగాణ అద్భుత ప్రతిభకు మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ కోసం హైదరాబాదును కేంద్రంగా ఎంచుకోవడం ఒక నిదర్శనం అన్నారు. జీసీసీలకు రాజధానిగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. మాజీ ప్రధాని నెహ్రూ మొదలుకొని ఆ తర్వాత పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మహా నేతలు దూరదృష్టితో చేపట్టిన చర్యల మూలంగా హైదరాబాద్‌కు మరింత బలం చేకూరిందని డిప్యూటీ సీఎం వివరించారు. మ్యాక్‌డొనాల్డ్స్ గ్లోబల్ నాయకత్వ బృందాన్ని హైదరాబాద్‌కు స్వాగతించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఇది ఇప్పుడు మీ ప్రపంచ ప్రతిభకు కొత్త నిలయం అని కంపెనీ ప్రతినిధులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం అన్నారు. దశాబ్దాల క్రమంలో ఆ బంగారు చిహ్నాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కోట్లాది మందికి సేవలు అందించే విధంగా ఆవిష్కరణ, నిర్వహణ కలయికకు చిహ్నమయ్యాయని డిప్యూటీ సీఎం వివరించారు. మార్క్ నాఫ్లర్ రాసిన “Boom, Like That” పాటలో — మెక్‌డొనాల్డ్స్ వ్యవస్థాపకుడు రే క్రాక్ కథకు ప్రేరణగా చెప్పినట్లుగా మ్యాక్‌డొనాల్డ్స్ కథ అనేది ఒకేసారి ఒక పల్లెలో ప్రపంచమంతా వ్యాపించిందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, హైదరాబాద్ కూడా అలాంటి ప్రయాణమే చేసింది అన్నారు. మినార్లు, సరస్సులతో ఉన్న చారిత్రక నగరం నుండి, డేటా, డిజైన్, నిర్ణయాల గ్లోబల్ హబ్‌గా ఎదిగిందన్నారు.
భారతదేశ అభివృద్ధి క్రమాన్ని పరిశీలిస్తే పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దూరదృష్టిని మరవలేమని భట్టి గుర్తు చేశారు. ఆయన ఆధునిక భారతదేశానికి పునాదులు వేశారు, వారి దూరదృష్టి పెట్టుబడి వల్లే హైదరాబాద్‌కు స్థిరమైన బలం వచ్చింది చేకూరిందన్నారు. సీసీఎంబీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, బీహెచ్ఈఎల్, ఈసీఎల్, ఇతర పబ్లిక్ సెక్టర్ సంస్థలు అన్నీ కూడా నెహ్రూ స్ఫూర్తి నుండి పుట్టినవే అని పేర్కొన్నారు. వారి తర్వాత ప్రధానిగా పనిచేసి పీవీ నరసింహారావు, వారి క్యాబినెట్‌లో డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రిగా నెహ్రూ దూరదృష్టిని మరింత బలంగా తీసుకెళ్లారని చెప్పారు. భారతదేశాన్ని ప్రపంచంతో ఆత్మవిశ్వాసంగా, జాగ్రత్తగా, కరుణతో అనుసంధానించారు అని వివరించారు. ఆర్థిక సంస్కరణ అంటే కేవలం మార్కెట్ గురించి కాదు, గౌరవంతో కూడిన అవకాశాలను సృష్టించడం అని తెలిపారు. ఆలోచనలో భాగంగానే సమానత్వంతో కూడిన వృద్ధి, సమిష్టి అభివృద్ధి అనే అంశాలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు అని డిప్యూటీ సీఎం తెలిపారు. గత రెండు దశాబ్దాల్లో హైదరాబాద్ ఇటువంటి సెంటర్లకు రాజధానిగా మారింది, వందలాది గ్లోబల్ కెపబిలిటీ హబ్‌లు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. హైదరాబాదులోని జీసీసీ సెంటర్లు చికాగోను చార్మినార్‌తో, బోస్టన్‌ను బంజారాహిల్స్‌తో, లండన్‌ను లింగంపల్లితో కలుపుతున్నాయి, హైదరాబాద్‌ను ప్రపంచ కమాండ్ సెంటర్‌గా మార్చుతున్నాయని, అక్కడ మార్కెట్లను, అనుభవాలను తీర్చిదిద్దే నిర్ణయాలు తీసుకోబడుతున్నాయని అన్నారు. మనమందరం కలిసి, ప్రపంచంలోని ఉత్తమ ఆలోచనలకు భారతదేశంలోని అత్యంత చురుకైన హైదరాబాదులో అవకాశం కల్పిద్దామని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో డోనాల్డ్ కంపెనీ ప్రతినిధులు మిస్ స్కై ఆండర్సన్, దేశాంత్ కైలా, మ్యాటిజ్ బ్యాక్స్, స్పీరో ద్రూలియాస్, శదాస్ దాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.







