Mahaa Daily Exclusive

  రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ….

Share

  • మంత్రివర్గంలోకి అజారుద్దీన్
  • రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ
  • జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ కీలకనిర్ణయం
  • ఆగస్టులోనే చెప్పిన మహాపత్రిక
  • మంత్రి వర్గ విస్తరణపై రెండ్రోజులుగా ఏఐసీసీలో చర్చ
  • సీఎంను కలిసి థ్యాంక్స్ చెప్పిన అజరుద్దీన్ ..
  • మైనారిటీ క్రీడాశాఖ లేదా అటవీశాఖ కేటాయించే అవకాశం

హైదరాబాద్, మహా

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రి వర్గంలో మాజీ క్రికెటర్​ అజారుద్దీన్​కు అవకాశం కల్పించనుంది. శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉంటుందని కాంగ్రెస్​ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అజారుద్దీన్​తో గవర్నర్ మంత్రిగా ప్రమాణం చేయించన్నారు. అజారుద్దీన్ ను కేబినెట్ లో తీసుకోబోతున్నారంటూ మహా పత్రికలో ఆగస్టు 31న ప్రత్యేక కథనం ప్రచురితమైంది. జూబ్లీహిల్స్ రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ లోకి తీసుకోవాలని హైకమాండ్ యోచనగా ఉండని పేర్కొంది. ఇపుడు అది నిజమవుతోంది. . మంత్రివర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఆల్​ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)లో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో 15 మంది ఉండగా, మరో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. అయితే ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు మాత్రమే ప్రస్తుతానికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుండి గతంలో అజారుద్దీన్ పోటీచేయగా, అజారుద్దీన్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించారు.

మైనార్టీకి మంత్రి పదవి

రాష్ట్రంలో ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా, ముస్లిం మైనార్టీకి ఒక మంత్రి పదవి కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున చాలా మంది ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఎక్కడా విజయం సాధించలేదు. నాంపల్లి నుంచి ఫిరోజ్​ఖాన్, షబ్బీర్​ అలీ, అజారుద్దీన్​ వంటి వారు ఒటమి చెందారు. దీంతో ఆ వర్గానికి కేబినెట్‌లో అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్​ పార్టీకి సాధ్యపడలేదు. ముస్లిం మైనార్టీ వర్గానికి ఏదో విధంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ హైకమాండ్​ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్‌ జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం సిద్ధపడ్డారు. అయితే, ఆయనకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్‌, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరామ్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక చేసింది. అయితే, వీరిద్దరి నియామకానికి గవర్నర్‌ జిష్ణుదేవ్​ వర్మ ఇంకా ఆమోదం తెలుపలేదు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తికాకపోయినప్పటికీ అజాహరుద్దీన్‌ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ ఆమోదం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

ఏఐసీసీలో కసరత్తు

మంత్రి వర్గ విస్తరణపై గత రెండ్రోజులుగా ఏఐసీసీలో విస్తృతంగా చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొదటి సారి సీఎం రేవంత్​ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం ముస్లిం మైనారిటీకి అవకాశం కల్పించింది.

గవర్నర్ కోటా కాకుంటే నిజామాబాద్ ?

ఒక వేళ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అజాహరుద్దీన్‌కు అవకాశం దక్కని పక్షంలో త్వరలో కొన్ని శాసన మండలి స్థానాలు ఖాళీ కానున్నాయి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల లోపు అజాహరుద్దీన్‌ను ఎమ్మెల్సీని చేసే అవకాశముందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గవర్నర్ కోటాలో జాప్యం జరిగితే నిజామాబాద్ స్థానికసంస్థల ఎమ్మెల్సీగా కవిత చేసిన రాజీనామాకు ఆమోదం లభిస్తే అక్కడ నుండి పోటీకి ఆస్కారం ఉండవచ్చన్న చర్చ జరుగుతోంది.

లైన్ లో రాజగోపాల్ ?
అజారుద్దీన్ కేబినెట్ బెర్త్ ఖరారు కాగా, మరో బెర్త్ కోసం రాజగోపాల్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చివరినిమిషం దాకా ఏమైనా జరగొచ్చని పేర్కొంటున్నారు. గతంలో ఏఐసీసీ, ముఖ్యమంత్రి రెండుసార్లు తనకు స్పష్టమైన హామీలిచ్చారని, మూడో విస్తరణలోనైనా తనకు అవకాఃశం ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెడ్డికి. మరొకటి మున్నూరుకాపుకు ఇవ్వాలన్న యోచనలో హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్నూరు కాపు నుండి ఆది శ్రీనివాస్ లేదా దానం నాగేందర్ లలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చన్న ప్రచారాలున్నాయి.

Latest