- హైదరాబాద్‌లో మరో 6 స్కైవాక్ ల నిర్మాణం
- ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హెచ్ఏండీఏ
హైదరాబాద్, మహా : హైదరాబాద్స లో పెరుగుతున్న ట్రాఫిక్, జంక్షన్ల రద్దీ దృష్ట్యా పాదచారుల భద్రత, సౌకర్యార్థం మరో ఆరు ప్రాంతాల్లో స్కైవాక్స్ నిర్మించేందుకు హెచ్ఎండీఏ కసరత్తు వేగవంతం చేసింది. నగరంలో మొత్తం 23 కీలక ప్రాంతాల్లో స్కైవాక్స్ అవసరమని హెచ్ఎండీఏ గతంలో గుర్తించగా ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో ప్రాధాన్యతా క్రమంలో స్కైవాక్‌ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ముందుగా ఆరు ప్రాంతాలలో స్కైవాక్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం హెచ్‌ఎండీఏను ఆదేశించింది. అఫ్జల్‌గంజ్, మదీన, లక్డీకాపూల్ పెట్రోల్‌బంక్, బీహెచ్‌ఈఎల్, జేఎన్‌టీయూ (కూకట్‌పల్లి), మియాపూర్ టీ జంక్షన్లలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఉప్పల్ జంక్షన్ వద్ద హెచ్ఎండీఏ అత్యాధునిక స్కైవాక్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కైవాక్ పాదచారులు ట్రాఫిక్ రద్దీ లేకుండా సాఫీగా ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి సులభతరం చేసింది. దీంతోపాటు మెహదీపట్నం వద్ద చేపట్టిన భారీ స్కైవాక్ నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. త్వరలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద మరో స్కైవాక్ నిర్మాణం కూడా ప్రారంభం కానుంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూకట్‌పల్లి జేఎన్‌టీయూ జంక్షన్ ఒకటి. ఇక్కడ ట్రాఫిక్ జామ్‌తో పాటు పాదచారుల రద్దీ విపరీతంగా పెరిగి, రోడ్డు దాటడం గగనంగా మారింది. పాదచారుల అడ్డగింత కూడా ట్రాఫిక్ జామ్‌కు ఒక కారణంగా మారుతున్న నేపథ్యంలో ఉప్పల్ తరహాలో ఇక్కడ కూడా భారీ స్కైవాక్ నిర్మించాలని హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది.
ఈ స్కైవాక్ జేఎన్‌టీయూ జంక్షన్, మెట్రో స్టేషన్, బస్‌స్టేషన్, ప్రముఖ లూలూ మాల్ వంటి కీలక ప్రాంతాలను అనుసంధానించే విధంగా రూపొందించనున్నారు. జేఎన్‌టీయూ క్యాంపస్‌ను కేంద్రంగా చేసుకొని నిర్మించే ఈ స్కైవాక్‌ను ఒక ‘స్పెషల్ హబ్’గా తీర్చిదిద్దాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది మెట్రో స్టేషన్, లూలూ మాల్‌తో పాటు ప్రగతినగర్, నిజాంపేట్ మార్గాల వైపు వెళ్లే పాదచారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నిర్మాణం పూర్తయితే జేఎన్‌టీయూ క్యాంపస్ పరిసర ప్రాంతం పాదచారులకు విశ్రాంతి జంక్షన్‌గా మారనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్‌లో కూడా రైల్వేస్టేషన్, మెట్రో స్టేషన్లు, బస్‌స్టాండ్‌లను అనుసంధానం చేస్తూ ఒక స్కైవాక్ నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏ డిజైన్లను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులతో నగరంలో పాదచారుల భద్రత, రవాణా సౌలభ్యం మరింత మెరుగుపడనున్నాయి







