Mahaa Daily Exclusive

  తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం:ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Share

  • తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం
  • యుద్ధ ప్రాతిపదికన పంటనష్టం అంచనా… పరిహారం చెల్లింపు
  • ప్రభుత్వ ముందస్తు సన్నద్దత మూలంగా నష్టం తీవ్రత తగ్గించాం
  • అవనిగడ్డలో మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అవనిగడ్డ, మహా : మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46 వేల హెక్టార్లలో నష్టం కలిగిందనీ చెప్పారు. ఈ జిల్లాలో దాదాపు 56 వేల మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మొంథా తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకున్నారు. అనంతరం కృష్ణా జిల్లా అధికారులు అవనిగడ్డలో తుపాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వం ముందస్తు సన్నద్దత మూలంగా మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. పక్కా ప్రణాళికతో నష్టం తీవ్రతను తగ్గించాం. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు కారణంగానే తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వీడియో కాన్ఫరెన్సులు, ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటలు పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. అటు యంత్రాంగాన్ని, ఇటు గ్రామ స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేశాం. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్ష 16 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం. ఈ విపత్తులో కౌలు రైతులు కూడా నష్టపోయిన విషయం నా దృష్టికి వచ్చింది. వారిని ఆదుకొనే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతాను అని పేర్కొన్నారు.

తుపాను అనంతర ఉపశమన చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించామని, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సుమారు 274 కిలోమీటర్ల మేర రహదారులు తుపాను దాటికి దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగిందన్నారు. దెబ్బతిన్న అన్ని రోడ్లను శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. పల్లపు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతోపాటు అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో సూపర్ శానిటేషన్.. సూపర్ క్లోరినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని తెలిపారు. జిల్లాల వారీగా పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా విభజించి పారిశుద్ధ్య మెరుగు పర్చే చర్యలు మొదలు పెట్టామని, 1,583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం కాగా, మొత్తం 21,055 మంది సిబ్బందిని పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్నామని తెలిపారు. తాగునీటి సరఫరా వ్యవస్థకు ఇబ్బంది ఏర్పటిన చోట్ల ప్రయత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇళ్లకు వెళ్లే ముందే ఆర్థిక సాయం

మొంథా ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి 25 కేజీల బియ్యాన్ని, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కేజీ పంచదార కూడా కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని తెలిపారు. శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందే ఒక్కొక్కరికీ రూ. వెయ్యి చొప్పున ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఒక్కో కుటుంబానికీ గరిష్టంగా రూ. 3 వేలు చెల్లించనున్నామని, తుపాను వల్ల సంభవించిన నష్టంపై ప్రాథమిక నివేదిక రాగానే కేంద్ర సహకారం కోరుతామన్నారు. కోడూరు మండల పరిధిలో సముద్రం కట్టపై దెబ్బ తిన్న అవుట్ ఫాల్ స్లూయిజ్ కొత్తగా నిర్మించడానికి నాబార్డ్ సాయం తీసుకుంటామన్నారు. ఎదురుమొండి దీవుల్లో సముద్ర కోతకు గురై దెబ్బ తిన్న ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.08 కోట్ల కేటాయించామని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యిందని, దీని ద్వారా ఐదు గ్రామాల ప్రజలకు రహదారి కష్టాలు తీరనున్నాయని అన్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా స్పెషల్ ఆఫీసర్, టూరిజం శాఖ ఎండీ అమ్రపాలి, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

Latest