- అజారుద్దీన్ అనే నేను
- మధ్యాహ్నం గం. 12.15 లకు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
- రాజ్ భవన్ దర్బార్ హాలులో ఏర్పాట్లు
హైదరాబాద్, మహా : మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు కొత్త మంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు రాజ్‌భవన్‌లో కేబినెట్ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రమాణస్వీకారోత్సవం జరిగే రాజ్‌భవన్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్ తదితర ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.
మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిశ్చయించింది. అంతేకాకుండా ఈ విస్తరణలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని కూడా ప్రభుత్వం డిసైడ్ అయినట్లు రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ క్యాబినెట్‌లో ఖాళీ ఉన్న మూడు మంత్రి పదవుల్లో ఒకదానికి అజహరుద్దీన్ కు అందించనున్నారు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ ఎలా చేస్తారని, ఇది ముమ్మాటికి ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే అజహరుద్దీన్ కు మంత్రి పదవి అన్న వార్తలపై బీజేపీ నాయకులు ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ సమయంలో అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారానికి అంతా రెడీ అన్న చర్చ సంచలనంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే నిజంగా మంత్రివర్గ విస్తరణ ఎలా జరుగుతుంది? అందుకు ఆస్కారం ఉందా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
15గా ఉన్న మంత్రుల సంఖ్య..
2023 డిసెంబర్ నెలలో రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈ మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్‌లకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. మరో మూడు మంత్రి పదవులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విస్తరణపై కూడా ఇప్పటికే చర్చలు జరుగుతుండగా ఇప్పుడు వాటిలో ఒకదానిని అజారుద్దీన్‌కు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది







