- మోకాలు లోతు బురదలో దిగి..
- నేలకొరిగిన పంట పరిశీలించిన పవన్
- నష్టపోయిన రైతుల్లో భరోసా నింపిన ఉప ముఖ్యమంత్రి
- అవనిగడ్డ పరిధిలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
కృష్ణా, మహా: మోకాలు లోతు బురదలో దిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నదాత కష్టాన్ని విని ఓదార్చారు. తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని పంట పొలాల మధ్యకు వెళ్లి పరిశీలించారు. అరటి రైతుల ఆవేదన విన్నారు. మీ కష్టంలో మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. గురువారం కృష్ణా జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన పవన్ నేరుగా కోడూరు మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి చేల వద్దకు వెళ్లారు. రైతులతో కలసి బురద చేలోకి దిగి పడిపోయిన పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొట్ట దశలో ఉన్న వరి కంకులను పరిశీలించారు. అన్ని విధాలా ఆదుకుంటామంటూ కూటమి ప్రభుత్వం తరఫున భరోసా ఇచ్చారు.
పొట్ట దశలో పుట్టి ముంచింది..
కృష్ణాపురం గ్రామానికి చెందిన శ్రీ కోట రమేష్ అనే రైతుకి చెందిన అయిదు ఎకరాల వరి పంట పూర్తిగా నేలకొరిగింది. పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఆ రైతు తనకు వచ్చిన కష్టాన్ని ఆయనకు వివరించారు. ఇప్పుడిప్పుడే వరి పొట్ట పాలు పోసుకుంటున్న దశలో తుపాను రావడం వల్ల పంట పూర్తిగా నాశనం అయిందని, ఎందుకూ పనికి రాకుండా పోయిందని పవన్ కళ్యాణ్ ఎదుట వాపోయారు. మరో రెండు వారాలు ఆగితే పంట కోత దశకు వచ్చేదని తెలిపారు. వెంకటేశ్వరరావు అనే రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. నీటిలో తడిసిన ధాన్యపు గింజలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కు త్వరితగతిన పంట నష్టం నివేదికలు ఇవ్వాలని సూచించారు. నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా ఉన్నారని, వారిని ఆదుకోవాలని పలువురు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. తుపాను కారణంగా నష్టపోయిన కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
నేలకొరిగిన అరటి తోట పరిశీలన..
అవనిగడ్డ మండల పరిధిలోని రామచంద్రపురం సమీపంలో తుపాను ధాటికి దెబ్బతిన్న అరటి తోటను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. విష్ణుమూర్తి అనే రైతుకి చెందిన అరటి తోట మొంథా తుపాను సమయంలో వీచిన పెనుగాలులకు పూర్తిగా నేల మట్టం అయినట్లు తెలుసుకున్నారు. సుమారు 1400 అరటి గెలలు పనికిరాకుండా పోయాయని రైతు పవన్ కు వివరించారు. ఉద్యాన శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే సమయంలో రైతులకి మేలు చేసేలా ఆలోచన చేయాలని సూచించారు. దెబ్బ తిన్న అరట తోటలో ఎంత మేర పనికొస్తుంది? తిరిగి తోట బతుకుతుందా లేదా? మొత్తం తీసి తిరిగి పంట వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? అనే వివరాలతో సమగ్ర నివేదికలు రూపొందించాలని తెలిపారు.
పంట నష్టం నివేదికలు రూపొందించండి..
పంట నష్టంపై గణన చేపట్టే సమయంలో వ్యవసాయ అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, రైతుల పక్షాన నివేదికలు రూపొందించాలని సూచించారు. జరిగిన నష్టానికి పక్కాగా అంచనా వేసి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
ప్రజలతో మమేకం.. తుపాను ప్రభావంపై ఆరా
పవన్ కళ్యాణ్ పర్యటన ఆద్యంతం ప్రజలతో మమేకమయ్యారు. రైతుల పరామర్శ అనంతరం తిరుగు ప్రయాణంలో కోడూరు, అవనిగడ్డ మధ్య విశ్వనాథపల్లి, వి.కొత్తపాలెం, మాచవరం తదితర గ్రామాల్లో రోడ్లపై బారులు తీరిన ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో తుపాను ప్రభావం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు, పవన్ కళ్యాణ్ తో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.పులిగడ్డ సమీపంలో రోడ్ సైడ్ కూరగాయలు, కొబ్బరి బొండాలు విక్రయించే వ్యాపారులను పవన్ పలకరించారు. అక్కడ ఉన్న ప్రజలను కలుసుకున్నారు. తుపాను ప్రభావం వల్ల ఎమైనా నష్టం వాటిల్లిందా అన్న విషయంపై ఆరా తీశారు. కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మచిలీపట్నం పోర్టుకి అనుసంధానంగా జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే లో భూములు కోల్పోతామన్న భయంతో పలువురు రైతులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తమ సమస్యను విన్నవించుకున్నారు. గతంలో 65వ నంబర్ జాతీయ రహదారి నిర్మాణంలోనూ భూములు కోల్పోయామని, ఇప్పుడు మరోసారి విలువైన భూములు కోల్పోతామన్న భయం పట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారిని విస్తరించకుండా, నేరుగా పోర్టు రోడ్డుకి కలిపేలా సమాంతరంగా మరో రహదారిని నిర్మించాలన్న తమ సూచనను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరి సమస్యలు వింటూ, ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సూచనలు చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు.







