Mahaa Daily Exclusive

  నవంబర్ 26 వరకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు..

Share

  • నవంబర్ 26 వరకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు
  • మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి, యువకులకు వివిధ అంశాల్లో పోటీలు
  • ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడి

మేడ్చల్, మహా : ఉక్కు మనిషి, స్వాతంత్ర సమరయోధుడు, దేశ మొదటి ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 వ జన్మ దినాన్ని పురస్కరించుకుని నవంబర్ 26 వరకు జిల్లాలో, జిల్లా స్థాయి, నియోజక వర్గం, మున్సిపల్, మండల స్థాయిలో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. గురువారం శామీర్ పేటలోని తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, మేరా యువ భారత్, జాతీయ సేవ పథకం, ఎన్.సి.సి శాఖల ఆధ్వర్యంలో సర్ధార్ పటేల్ స్ఫూర్తిని చాటి చెప్పేందుకు మునుపెన్నడూ లేని విధంగా యువత, విద్యార్థులను భాగస్వాములను చేస్తూ, వివిధ పోటీలు నిర్వహించ నున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందులో, విద్యార్థులకు క్విజ్ పోటీలు, రీల్స్, వ్యాస రచన పోటీలు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఈటెల పేర్కొన్నారు. అలాగే, వివిధ రంగాల్లో నిష్ణాతులు, 39 ఏళ్ళున్న వారిని, స్కూల్స్, కాలేజీలు, విద్యా సంస్థల విద్యార్థులు, యూత్ ను ఇందులో భాగస్వాములను చేయనున్నామన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో తాను స్వయంగా పాల్గొననున్నట్టు కూడా ఈటెల తెలిపారు. ఇవాల్టి ఈ స్వేచ్చ ఊరికే వచ్చింది కాదని, లక్షలాది మంది భారత జాతి ముద్దు బిడ్డలు తమ జీవితాలను త్యాగాలు చేయడమే కాకుండా, అండమాన్ జైళ్ళలో మగ్గిన విషయాలను ఈటెల గుర్తు చేస్తూ, వారి త్యాగాలను నేటి సమాజం మరిచిపోయిందన్నారు. ఎంత అభివృద్ధి జరిగినా భారత జాతిని కలిపి ఉంచేది దేశ భక్తి మాత్రమే నని ఆయన ఈటెల ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 జన్మ దినం సందర్భంగా మరొకసారి భారత జాతి ఔనత్యం, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈటెల మేరా యువ భారత్, యువజన, క్రీడల సంక్షేమ శాఖలను ఆదేశించారు. దీనికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కూడా ఈటెల వివరించారు. కార్యక్రమంలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేరా యువ భారత్, యువజన అధికారి టి. ఐజయ్య, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి, ఎన్.ఎస్.ఎస్. ఉప్పల్ పీ.ఓ విశ్వనాథ్, కమిటీ మెంబర్లు కె.విజయ కుమార్, బి.శ్రీనివాస్, మహేందర్ యాదవ్, దాసి నాగరాజు, ముత్యం రెడ్డి, సుధాకర్  పాల్గొన్నారు

Latest