Mahaa Daily Exclusive

  నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌…

Share

  • నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌
  • సుప్రీం కోర్టు 53వ సీజేఐగా సూర్యకాంత్ నియామకం
  • రాష్ట్రపతి ఆమోదముద్ర.. వచ్చేనెల 24 ప్రమాణం

ఢిల్లీ, మహా: సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం అయ్యారు. అయితే ప్రస్తుతం సీజేఐగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ ఆర్ గవాయ్ పదవీకాలం నవంబర్ 23న ముగుస్తుండటంతో.. కొత్త సీజేఐ నియామక ప్రకటన జరిగింది. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర పడటంతో కొత్త సీజేఐగా సూర్యకాంత్ నవంబర్ 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దాదాపు 14 నెలలపాటు ఆ పదవిలో..
నవంబరు 24వ తేదీన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ సూర్యకాంత్‌ 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. అంటే ఆయన దాదాపు 14 నెలలపాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఇక చిన్న పట్టణంలో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ సూర్యకాంత్‌.. 1962 ఫిబ్రవరి 10న హరియాణా హిస్సార్‌ జిల్లాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అక్కడే 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్‌ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్‌ హరియాణా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్‌ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకూ హరియాణా అడ్వకేట్‌ జనరల్‌గా పని చేశారు. 2018 అక్టోబరు 5న హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

కీలక తీర్పుల్లో భాగస్వామి..
రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పని చేసిన జస్టిస్‌ సూర్యకాంత్‌ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు. దీంతోపాటు వాక్‌స్వాతంత్య్రం, అవినీతి, బిహార్‌ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగసమానత్వం వంటి అంశాల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు. బ్రిటీష్‌ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పులో జస్టిస్‌ సూర్యకాంత్‌ భాగస్వామి. ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయవద్దని ఈ తీర్పులో ఆదేశించారు. బిహార్‌లో ప్రత్యేక ముమ్మర సవరణలో (సర్‌) భాగంగా 65 లక్షల మంది ఓటర్లను తొలగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఆయన ధర్మాసనం తీర్పు చెప్పింది. తీసేసిన వారందరి పేర్లను బహిరంగపరచాలని ఆదేశించింది. సుప్రీంకోర్టుతోపాటు అన్ని కోర్టుల బార్‌ అసోసియేషన్లలో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఆయన ఆదేశించారు

Latest