- వరదల్లో వరంగల్
- మొంథా తుఫాన్ ప్రభావంతో అల్లకల్లోలం
- జలమయమైన వరంగల్, హన్మకొండ, కాజీపేట
- మునిగిన జవహర్ కాలనీ, గోపాల్ పూర్, హండ్రెడ్ ఫీట్ రోడ్డు
- ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహయంతో తరలిస్తున్న ఎస్డీఆర్ఎఫ్
వరంగల్, మహా: ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అతలాకుతలమయింది. హైదరాబాద్-వరంగల్ హైవే మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధానంగా వరంగల్ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్-హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొంది వాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భద్రకాళి ఆలయానికి రాకపోకలు బంద్ అయ్యాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలో ఆరు పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటుచేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. ములుగు రోడ్డు వద్ద నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్‌ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేశ్ కాలనీలోని ఇళ్లల్లోకి వరదనీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
నిలిచిపోయిన రాకపోకలు..
హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో జవహర్ కాలనీ, గోపాల్‌పూర్, 100 ఫీట్ల రోడ్డు జలమయమయ్యాయి. కాజీపేట నుంచి హనుమకొండ మార్గంలోని సోమిడి, గోపాల్‌పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి. భారీగా వరద నీరు రోడ్డు పైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైక్‌లు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 42 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రోడ్లన్నీ కాలువలుగా మారగా.. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీల్లో వరద ఉధృతికి పలుచోట్ల కార్లు, బైక్‌లు కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. వరదనీరు ముంచెత్తడంతో చెరువును తలపిస్తోంది హనుమకొండ బస్టాండ్. హనుమకొండ నెహ్రూ స్టేడియం చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ నీట మునిగాయి. హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరింది. హనుమకొండలోని జవహర్‌కాలనీ, గోపాల్‌పూర్, హండ్రెడ్ ఫీట్ రోడ్, వివేక్‌నగర్, అమరావతినగర్, ప్రగతినగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. కాజీపేట, హనుమకొండలో సోమిడి, గోపాల్‌పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి.
రెస్క్యూ ఆపరేషన్..
హన్మకొండలోని హంటర్ రోడ్ లో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నీట మునిగింది. ప్రస్తుతం ఈ హాస్టల్లో 200 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. వీరిని రెస్క్యూ బృందాలు రెస్క్యూ చేస్తున్నాయి.వరంగల్లోని అండర్ రైల్వే బ్రిడ్జి ప్రాంతం, రామన్నపేట, కాశిబుగ్గ, వరంగల్ ఎన్ ఎన్ నగర్, బిఆర్ నగర్, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డి ఆర్ యఫ్, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి బోట్ల సహాయంతో వరద ముంపులో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
రంగంలో ఏడు రెస్క్యూ బృందాలు..
వరంగల్ నగరంలో ఏడు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. బీరన్న కుంట ప్రభుత్వ పాఠశాల, వరంగల్ లోని ఆరేపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఎనుమాముల మార్కెట్లోని శుభం గార్డెన్ , కొత్త వాడలోని లక్ష్మీ గార్డెన్ తదితర పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
సహాయక చర్యల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు..
హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య ముంపు ప్రమాద బాధితులను పరామర్శిస్తూ సహాయక చర్యలను చేపడుతున్నారు. రహదారులపై భారీగా వరద చేరటంతో వరంగల్, హన్మకొండ నగరాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలో అనేక ప్రాంతాలు ముంపుకు గురి కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొంది.ఇటు వరంగల్ నగరానికి కరీంనగర్ నుంచి వచ్చే రోడ్లు, హైదరాబాద్ నుండి వచ్చే రోడ్లు కూడా ముంపుకు గురి కావడంతో నగరం జలదిగ్బంధనం గా మారింది. ఈరోజు వర్షం ప్రస్తుతం తెరపినివ్వడంతో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి







