Mahaa Daily Exclusive

  ఎకరాకు రూ.10 వేల సాయం….

Share

  • ఎకరాకు రూ.10 వేల సాయం
  • నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
  • మార్కెట్‌లో తడిచిన ధాన్యాన్ని కొనాలని ఆదేశించాం
  • నేటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారు
  • రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా

ఖమ్మం, మహా: తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామన్నారు. 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. ఖమ్మంలో మున్నేరు వరద ఉద్ధృతిని మంత్రి తుమ్మల పరిశీలించారు. మున్నేరు 26 అడుగులకు చేరిందని, ఇక పెరిగే అవకాశం లేదన్నారు. ఎగువ నుంచి వరద క్రమంగా తగ్గుతోందని తెలిపారు. మున్నేరు కరకట్టలు పూర్తయితే ఖమ్మం నగరానికి ఢోకా ఉండదని చెప్పారు. రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

పశుసంపద, ఇళ్లు నష్టపోయినా ఆదుకుంటామని చెప్పారు. 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘నేటి నుంచి వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారు. నష్టపోయిన ప్రతి రైతు పంట వివరాలు నమోదు చేస్తారు. మార్కెట్‌లో తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ఆదేశించాం. 11 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకుంటాం. కేంద్రం సహకరించకపోయినా ప్రతి రైతుకు అండగా నిలుస్తాం. గత ఏడాది వరదల్లోనూ భారీగా పంట నష్టం జరిగినా కేంద్రం సాయం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక సమర్పించినా స్పందించలేదు’’ అని మంత్రి తుమ్మల విమర్శించారు

Latest