- జూబ్లీహిల్స్‌లో హస్తం మాస్ స్ట్రాటజీ!
- ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ నేతలు
- సెగ్మెంట్‌లో డోర్ టు డోర్ ప్రచారంలో నేతల జోరు
- కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు మద్దతుగా మంత్రుల ప్రచారం
- పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్న ప్రజలతో మమేకం
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని లక్ష్మీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రచారంలో రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజ నరసింహా, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ కేతూరి వెంకటేష్, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు, విజయ డైరీ చైర్మన్ అమిత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఎర్రగడ్డ డివిజన్ ఇన్‌చార్జ్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి కూడా పాల్గొని ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న యువ, ప్రజా సంకల్పంతో నిండిన అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించడం ఎంతో కీలకమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు నిజమైన అభివృద్ధి, శాంతి, సామాజిక న్యాయం కావాలంటే నవంబర్ 11న జరగబోయే ఎన్నికల్లో చేతి గుర్తు కు ఓటు వేసి, కాంగ్రెస్ పార్టీని ఘన విజయంతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు.. కార్యకర్తలు, స్థానిక నాయకులు, మహిళలు, యువత, ప్రజలు పాల్గొన్నారు







