- రెండేళ్ళలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్
- బీఆర్ఎస్లో చేరిన ఎంఐఎం నాయకులు
- పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
హైదరాబాద్, మహా : రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పలువురు ఎంఐఎం నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇస్తాం, యువతులకు స్కూటీలు ఇస్తాం, వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామంటూ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఫైరయ్యారు. ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా దారి తప్పించిందో గుర్తుచేసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఆ డబ్బులు తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎప్పుడిస్తారో నిలదీయాలని అన్నారు. ఇవి కారుకు, బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఎన్నికలని కేటీఆర్ అభివర్ణించారు. పేదల ఇండ్లు కూలగొట్టిన ఈ బుల్జోజర్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కొందరు కాంగ్రెస్ నేతలు ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వారికి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని ఆయన ధైర్యం చెప్పారు. ప్రజలకు తాము ఎప్పటికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా పనిచేయాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు







