- ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవులు
- ప్రేమ్ సాగర్‌రావు, పి.సుదర్శన్‌రెడ్డికి క్యాబినెట్ హోదా పోస్టులు
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, మహా: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్‌లో మాజీ ఎంపీ అజారుద్దీన్‌కు చోటు కల్పించిన కాంగ్రెస్ సర్కార్… ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో కీలక పదవులలో నియమించింది. ఆ జాబితాలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. ఈ ఇరువురు నేతలు కూడా కేబినెట్‌లో చోటు ఆశించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత సమీకరణాల నేపథ్యంలో వారికి కేబినెట్‌లో చోటు కల్పించడం కుదరకపోవడంతో… కేబినెట్ హోదాతో కీలక పదవులు కల్పించింది. ఈ మేరకు వేర్వేరుగా ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును నియమిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఆయన కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టుగా పేర్కొంది. ఇక, ప్రభుత్వ సలహాదారు (అన్ని ప్రధాన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు)గా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియమించింది. ఆయన కేబినెట్ ర్యాంక్, హోదా కల్పిస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. అంతేకాకుండా కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
కొత్తవారికి మంత్రి పదవులు..
సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్నిపూర్తిస్థాయిలో విస్తరించడానికి లైన్ క్లియర్ చేశారు. ఈ క్రమంలో నవంబర్‌లో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు సమాచారం. అయితే కేబినెట్ విస్తరణలో భాగంగా కొంతమందిని పక్కన పెట్టి కొత్తవారికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యత ఆధారంగా కేబినెట్ కూర్పు చేయనున్నట్లు తెలుస్తోంది







