- ఎకరాకు రూ. 10 వేలు కాదు.. 50 వేలు ఇవ్వండి
- మానవతా దృక్పథంతో రైతన్నలను ఆదుకోవాలి
- ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్
కరీంనగర్, మహా: రాష్ట్రంలో భారీ వర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు కాకుండా.. ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కొట్టుకుపోయిన కల్వల మత్తడిని శుక్రవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. కల్వల మత్తడి కొట్టుకుపోయి 3 ఏళ్ళు అవుతోందని.. దీని రిపేర్ కోసం గత ప్రభుత్వమే రూ. 70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చిందని, కానీ తర్వాత ప్రభుత్వం మారటంతో పనులు జరగటం లేదన్నారు. ఈ మత్తడిని రిపేర్ చేయించాలని హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గ ఇద్దరు ఎమ్మెల్యేలను కోరుతున్నట్లు తెలిపారు. 6 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్ట్‌పై వందలాది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు.
బండి సంజయ్ ఆ పని చేయాలి..
మొంథా తుపాను కారణంగా తెలంగాణ మొత్తం రైతులు నష్టపోయారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, ఖమ్మం రైతులకు మాత్రమే ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామన్నట్లుగా విన్నామని చెప్పారు. శంకరపట్నంలో కూడా వరి రైతులు నష్టపోయారని.. వారికి కూడా పరిహారం ఇవ్వాలన్నారు. ఎకరాకు రూ. 10 వేలు కాకుండా ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు చేతికొచ్చిన పంటను రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పుడు పంట కోసిన కూడా 25 శాతం వచ్చే పరిస్థితి లేదన్నారు. అందుకే ప్రభుత్వం రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి అధికారులను ఫీల్డ్ కు పంపించి పంట నష్టం లెక్కలు తీయాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేంద్రం తరఫున రైతులకు పంట నష్టం పరిహారం ఇప్పించాలని కోరారు. కల్వల మత్తడి రిపేర్ కోసం ముఖ్యమంత్రితో ఎంపీ మాట్లాడాలన్నారు. అటు ఈ ప్రాజెక్ట్ మీదనే దాదాపు 180 ముదిరాజ్ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని.. వారికి ఇదే జీవనాధారమని చెప్పారు. వెంటనే మత్తడి బాగు చేయించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు







