Mahaa Daily Exclusive

  అట్టహాసంగా అజారుద్దీన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం..

Share

  • ఏ శాఖ ఇచ్చినా ఓకే
  • నా గూర్చి మాట్లాడే అర్హత కిషన్ రెడ్డికి లేదు
  • బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చేస్తున్న ఆరోపణలు: అజారుద్దీన్‌
  • అట్టహాసంగా అజారుద్దీన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం
  • హాజరైన గవర్నర్, సీఎం రేవంత్, భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు

హైదరాబాద్, మహా: మంత్రిగా తనకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని అజారుద్దీన్‌ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. అల్లా పేరు మీద అజారుద్దీన్ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్గంలో అజారుద్దీన్‌ చేరికతో తెలంగాణ కేబినెట్‌ మంత్రుల సంఖ్య 16కి చేరింది. అయినా తెలంగాణ కేబినెట్‌లో ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.

ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలే..
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మీడియాతో అజారుద్దీన్‌ మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తనపై చేస్తున్న విమర్శలపై స్పందించారు. తనపై వచ్చినవన్నీ ఆరోపణలు మాత్రమేనని, బీజేపీ, బీఆర్ఎస్ నేతల విమర్శలు సరైనవి కావని మండిపడ్డారు. తన గురించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పూర్తిస్థాయి అవగాహన లేదని విమర్శించారు. తనపై ఉన్న ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదని, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రిగా తనకు అవకాశం కల్పించారు.. తనకు ఏ శాఖ ఇచ్చినా ఇబ్బంది లేదని అజారుద్దీన్‌ స్పష్టం చేశారు

Latest