Mahaa Daily Exclusive

  4 వేల పెన్ష‌న్, తులం బంగారం ఇచ్చారా?కేటీఆర్

Share

  • 4 వేల పెన్ష‌న్, తులం బంగారం ఇచ్చారా?
  • జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ డిపాజిట్ గ‌ల్లంతు కావాలి
  • చీర‌ల్లేవు.. రంజాన్ తోఫా దిక్కలేదు.. క్రిస్మ‌న్ కానుక కూడా వ‌స్త‌లేదు
  • రోడ్‌షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మహా: నాలుగు ల‌క్ష‌ల మంది జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు 4 కోట్ల మంది తెలంగాణ ప్ర‌జ‌ల గోస తీర్చే అవ‌కాశం మీ చేతికి వ‌చ్చింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షేక్‌పేట్ డివిజ‌న్‌లో నిర్వ‌హించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు. రేవంత్ రెడ్డి రోత మాట‌లు, ప‌నికిమాలిన భాష మాట్లాడుతున్నాడు. హామీల‌పై ప్ర‌జ‌లు నిల‌దీస్తే వారిని ద‌బాయిస్తూ మీరు న‌న్ను ఏం చేస్తారు కోసుకు తింటారా… కొడుతారా..? అని హుంక‌రిస్తున్న‌రు. ఇది కుటుంబ పెద్ద‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణ‌మా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిల‌దీశారు. ఎన్నిక‌లు వ‌స్తాయి.. పోతాయి. 4 ల‌క్ష‌ల మంది జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు 4 కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల గోస తీర్చే అవ‌కాశం మీ చేతికి వ‌చ్చింది. మీరు జూబ్లీహిల్స్‌లో గ‌ట్టి తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జ‌ప్తు చేస్తే క‌చ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన ప‌థ‌కాల‌న్నీ బ్ర‌హ్మాండంగా ప్ర‌జ‌ల‌కు అందుతాయి. కాంగ్రెస్ డిపాజిట్ గ‌ల్లంతు కావాలి. పెన్ష‌న్లు, తులం బంగారం, స్కూటీలు, 2500 రావాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కొడుతున్నామా మ‌ళ్లీ జూబ్లీహిల్స్.. మీ జోష్ ఉత్సాహం చూస్తుంటే గెలుపు ప‌క్కా మెజార్టీ ఏంద‌నేది తేలాలి. ఈ రెండేండ్ల‌లో ఏవ‌రికి అన్న మంచి జ‌రిగిందా..? వాగ్దానాలు అమ‌ల‌య్యాయో లేదో గుర్తు చేసుకోండి. అర చేతిలో స్వ‌ర్గం చూపించి అడ్డ‌గోలు హామీలిచ్చి రైతుల‌ను, మ‌హిళ‌ల‌ను మోసం చేశారు. క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్పి అధికారంలోకి వ‌చ్చారు. ప‌దేండ్ల మా ప‌రిపాన‌ల మీ ముందు ఉంది. రెండేండ్ల కాంగ్రెస్ పాల‌న మీ ముందుంది. ఎవ‌రి పాల‌న‌లో మంచి జ‌రిగిందో ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ ఓటేసేందుకు ఒక్క కార‌ణం కూడా లేదు. ఒక్క ఆడ‌బిడ్డ‌కైనా 2500 అందాయా..? 4 వేల పెన్ష‌న్, తులం బంగారం ఇచ్చారా..? స్కూటీలు ఇచ్చారా..? క‌రెంట్ కూడా చ‌క్క‌గా ఇస్త‌లేరు. 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు ఫ్రీ వాట‌ర్ ఇచ్చారు కేసీఆర్. ఈ ప్ర‌భుత్వం వ‌చ్చాక నీటి బిల్లులు వ‌స్తున్నాయి. పేద‌ల‌కు ప‌థ‌కాలు ఇచ్చే తెలివి లేదు కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి. కేసీఆర్ మ‌తం పేరు మీద రాజ‌కీయాలు చేయ‌లేదు. బ‌తుక‌మ్మ‌కు కేసీఆర్ చీర‌లు ఇచ్చే వారు. కాంగ్రెస్ పాల‌న‌లో చీర‌ల్లేవు. రంజాన్ తోఫా వ‌చ్చేది. ఇప్పుడు లేదు. క్రిస్మ‌న్ కానుక కూడా వ‌స్త‌లేదు. రెండేండ్ల నుంచి ఒక్క హామీ కూడా అమ‌లు కాలేదు అని కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు

Latest