- దోచుకున్న బీఆర్ఎస్‌కు ఓట్లడిగేహక్కులేదు.
- బీఆర్ఎస్, బిజేపీ ఒక తానుముక్కలే
- మంత్రి పొంగులేటి సమక్షంలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మైనార్టీ యువత
హైదరాబాద్ : పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతిన్న బీఆర్ఎస్ నాయకులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని రాష్ట్ర రెవెన్యూ ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీజేఆర్ తల్లితండ్రుల పేరు కలిగిన శివమ్మ, పాపిరెడ్డి హిల్స్‌లో మంత్రి పొంగులేటి కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పీజేఆర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసిన తర్వాత ఇంతవరకు మళ్లీ అటువంటి అభివృద్దే లేదని అన్నారు. ధనిక తెలంగాణాను అప్పుల్లో ముంచిన గత పాలకులు పేదలకు ఇండ్లు కట్టిస్తే కమీషన్లు రావని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టారని ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది చేయలేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కేవలం 20 నెలల్లో కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ సరిపోల్చుతున్నారని, వారి అజ్ఞానానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. ఎన్నికల తర్వాత తాను ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి పేదలకు ఇండ్లపట్టాలు, ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విడతల్లో పేదలకు ఇండ్లు మంజూరు చేస్తూ ఇండ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున అందజేస్తుందని తెలిపారు.
పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్న బీఆర్ఎస్ కు ఓట్ల అడిగే హక్కు లేదని, బీఆర్ఎస్- బీజేపీ ఒక తాను ముక్కలేనని అన్నారు. గత పార్లమెంటు ఎన్నికల నుంచి వాటి మధ్య పొత్తు ఉందని అన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు తధ్యమని అందువల్లే బీఆర్ఎస్ మాజీ మంత్రులు అక్కసుతో మాట్లాడుతున్నారని, ఆ మాజీ మంత్రులు భాష సంస్కరించుకోవాలని పొంగులేటి హితవు పలికారు. ఈ ఎన్నికలతో బీఆర్ఎస్ నేతలు చెంప చెళ్లుమనేలా కాంగ్రెస్ అభ్యర్ధికి మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఎన్నికలు అయ్యాక ఈ నియోజకవర్గానికి వస్తా ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తానని, తన పాదయాత్రలో పలువురు ప్రజలు చెప్పిన సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. అంతేగాక అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో కోటి రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గంలోని ఎస్.పి.ఆర్ హిల్స్ ప్రాంతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వందమంది మైనార్టీ యువకులకు, మరో వంద మంది మహిళలకు కాంగ్రెస్ కండువాలు కప్పి మంత్రి పొంగులేటి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రికి గజపూల మాల, నృత్యాలతో అక్కడి ప్రజలు స్వాగతం పలికారు







