Mahaa Daily Exclusive

  మరో ఆరు నెలలు కాల్పుల విరమణ……లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ…

Share

  • మరో ఆరు నెలలు కాల్పుల విరమణ
  • లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
  • కేంద్రంపై పోరాడాలని ప్రజలకు పిలుపు

హైదరాబాద్, మహా : వరుస దెబ్బలతో మావోయిస్టు పార్టీ రోజురోజుకూ కృషించి పోతుంది. వరుస పెట్టి కీలక నేతలు ఒక్కొక్కరు లొంగిపోతున్నారు. ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో లొంగుబాటులు ఎక్కువ అవుతున్నాయి. మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంల తిరస్కరించారు. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి కాల్పుల విరమణపై సోమవారం మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ తెలంగాణ కమిటీ అధికారిక ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేశారని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. “ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ క్రమంలో గత మే నెలలో మేము 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించాము. ఈ 6 నెలల కాలంలో అనుకున్న పద్ధతులను మా వైపు నుంచి అమలు చేశాము. శాంతియుత వాతావరణం కొనసాగేలా వ్యవహరించాము. ఇదే శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది. కావున ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నాము. గతంలో కొనసాగిన విధంగానే తమ వైపు నుంచి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తాము. ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే ఉండాలని కోరుతున్నాము” అని జగన్ లేఖలో వెల్లడించారు.

కేంద్రంపై పోరాడండి

కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని ఆ లేఖలో జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో ముందుకు రావాలని, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నామన్నారు.

Latest