- ధర్మపురి ఆలయాన్ని సమగ్రాభివృద్ధి చేస్తాం
- గోదావరి పుష్కరాలకు రూ. 50 కోట్లతో ఏర్పాట్లు
- ఆలయ మాస్టర్ ప్లాన్ రివ్యూలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, మహా : జగిత్యాల జిల్లాోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు కూడా సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధర్మపురి ఆలయ మాస్టర్ ప్లాన్ పై సోమవారం మంత్రి సురేఖ రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎండోమెంటు డైరెక్టర్ హరీష్, డిపార్టుమెంటు ఉన్నతాధికారులు, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, వందల ఏళ్ళ చరిత్ర గల ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్రం, వేద పండితులు, స్థానికుల, భక్తులు మనోభావాలకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధర్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు మూర్తి, ఋషులు, దేవతలు సంచరించిన పవిత్ర ప్రాంతం, ఈ అంశం దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. దాంతోపాటు, 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని మంత్రి ఆదేశించారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్ కు అవసరమైన స్థల సేకరణ వివరాలు మంత్రి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం రూ. 50 కోట్లతో చేపట్టే నిర్మాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా చూడాలని చెప్పారు.
మంత్రి సురేఖకు అడ్లూరి ప్రత్యేక ధన్యవాదాలు
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, తన నియోజకవర్గంలో కొలువై ఉన్న స్వామివారి ఆలయాన్ని విస్తృతంగా అభివృద్ది పరుస్తున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంత పని ఒత్తిడిలోనూ తమ టెంపుల్ కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి అభివృద్ధి చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ టెంపుల్ కోసం అయ్యే స్థల సేకరణకి సంబంధించిన అంశాల్లో తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో గోదావరి పుష్కరాలు కూడా విజయవంతం చేస్తామన్నారు







