Mahaa Daily Exclusive

  ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్‌ పనులు పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్

Share

  • కమీషన్లు రావనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పట్టించుకోలే
  • జగన్‌ పోతిరెడ్డిపాడు విస్తరిస్తుంటే చూస్తూ ఊరుకున్నారు
  • పదేళ్లలో ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఎన్నో ప్రాజెక్టులు చేపట్టింది
  • తెలంగాణలో మాత్రం కేసీఆర్‌ కృష్ణానదిపై ప్రాజెక్టులు పూర్తి చేయలేదు
  • ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్‌ పనులు పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్
  • హెలీ మాగ్నటిక్‌ సర్వే పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి

అచ్చంపేట, మహా: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనుల కోసం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తల నేతృత్వంలో అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ముఖ్యమంత్రి సమక్షంలో హెలికాప్టర్ ద్వారా హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. రెండు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి చేపట్టామని గుర్తు చేశారు. ఆ క్రమంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిపోయిన 9.8 కిలోమీటర్ల పనుల కోసం ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు, టన్నెల్ నిర్మాణాల్లో అనుభవం కలిగిన ఆర్మీ అధికారుల సేవలను వినియోగించి ముందుకు వెళుతున్నామని చెప్పారు. టన్నెల్‌ బోర్‌ మిషన్‌తో పనులు చేయడం కష్టంగా మారిందని, పనులపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం తగదని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. టన్నెల్‌ పనులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్లలో మిగతా 10కి.మీ టన్నెల్‌ పూర్తి చేయలేదని, పెద్దగా కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టారని విమర్శించారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును విస్తరిస్తుంటే కేసీఆర్‌ చూస్తూ ఊరుకున్నారని అన్నారు. కృష్ణా నది మీద చేపట్టిన అన్ని ప్రాజెక్టులను కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారు. గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కేసీఆర్‌ ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్లు చెల్లించింది. ఆ మొత్తంలో కాళేశ్వరం కాంట్రాక్టర్లకే రూ.1.06 లక్షల కోట్లు చెల్లించారు. గత పదేళ్లలో ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేసింది. తెలంగాణలో మాత్రం కేసీఆర్‌ ప్రభుత్వం కృష్ణానదిపై ప్రాజెక్టులు పూర్తి చేయలేదు’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

రెండు దశాబ్దాల పాటు పనులు జరగలేదు..
‘ఎన్జీఆర్ఐ నేతృత్వంలో నిర్వహిస్తున్న సర్వే వల్ల భూగర్భంలో 800 నుంచి 1000 మీటర్లలోపు ప్రతి 2.5 మీటర్లలో రాయి, నీటి ప్రవాహాలకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రాంతమంతా టైగర్ రిజర్వ్ ఉంది. పర్యావరణం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలను 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు సరఫరాకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 1983 లో పునాది పడినప్పటికీ ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు పనులు జరగలేదు. తిరిగి 2004 లో నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాజెక్టు టన్నెల్-1, టన్నెల్ 2 పనులు ప్రారంభమయ్యాయి. గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఈ ప్రాజెక్టు 44 కి.మీ టన్నెల్ కోసం ఆనాడు దాదాపు 33 కి.మీ పూర్తి చేయగా, గత ప్రభుత్వ హయాంలో దశాబ్దకాలం ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రాజెక్టును ప్రారంభించిన నాడు ప్రపంచంలోనే అత్యంత అధునాతన టన్నెల్ బోర్ మిషన్ ఉపయోగించి ప్రయోగాత్మకంగా పనులు చేపట్టారు. దేశంలోనే ఇదొక అత్యుత్తమ ప్రాజెక్టు. 44 కి.మీ టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మరెక్కడా లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు మంచి పేరు రావడమే కాకుండా నయా పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటిని సరఫరా చేయొచ్చు. ప్రస్తుతం ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్న నీటికి కేవలం విద్యుత్ చార్జీల కోసం ఏటా 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది.

గ్రీన్ చానెల్ ద్వారా మంజూరు చేస్తాం..
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్‌బీసీని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్లినప్పుడు ఊహించని ప్రమాదం సంభవించింది. మాకెంతో బాధ కలిగించింది. ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకున్నాం. అందుకే అనుభవం, అత్యంత నైపుణ్యం ఉన్న వారిని ఇక్కడికి రప్పించాం. ప్రాజెక్టును పూర్తి చేయడానికి భారత సైన్యం నుంచి కూడా అధికారిని డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నాం ఈ క్రమంలో టన్నెల్ పనులను ముందుకు తీసుకెళ్లడానికి భూగర్భంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ సర్వేను చేపట్టాం. పైగా అదనంగా పైగా ఖర్చు లేకుండా ఆనాడు వేసిన అంచనాలతోనే ఈనాడు పనులు పూర్తి చేయనున్నాం. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరు. ఇప్పుడు పూర్తి చేసుకోలేకపోతే మరెప్పుడూ పూర్తి చేసుకోలేం. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ దీన్ని పూర్తి చేసుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉంది. నిధులకు ఎలాంటి ఆటంకం లేదు. గ్రీన్ చానెల్ ద్వారా మంజూరు చేస్తాం. ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి మర్లపాడు తండా, కేశీ తాండా, నక్కలగండి తాండా వాసులకు డిసెంబర్ 31 నాటికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులు పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టం లేకుండా ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది’ అని స్పష్టం చేశారు.
============

Latest