Mahaa Daily Exclusive

  మాటలకందని మహా విషాదం… చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 21 మంది దుర్మరణం

Share

  • మాటలకందని మహా విషాదం
  • చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 21 మంది దుర్మరణం
  • బస్సును ఢీకొన్న లారీ.. కంకరలో కలిసిపోయిన ప్రాణాలు
  • మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లతో పాటు మహిళలు, చిన్నారి
  • డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు
  • పది మందికిపైగా కంకర కిందే సమాధి.. కాపాడమంటూ మరికొందరు ఆర్తనాదాలు
  • క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్
  • మోదీ, రేవంత్, కేసీఆర్ సంతాపం.. మృతులకు రూ. 7 లక్షల ఎక్స్ గ్రేషియా
  • ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ కారణమన్న పోలీసులు.. బస్సు, లారీ డ్రైవర్లు మృత్యువాత

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మహా: ఏపీ కర్నూల్ బస్సు ప్రమాదం మరువక ముందే మరో విషాదం జరిగింది. చేవెళ్లలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో సురక్షితంగా ప్రయాణిస్తున్న వారిపైకి మృత్యు శకటంలా లారీ దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే.. ప్రాణాలుపోయాయి. ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపింది. టిప్పర్ లారీలోని కంకరే ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. కంకర ఒక్కసారిగా మీద పడటంతో.. ప్రయాణికులు ఎక్కువమంది చనిపోయారు. పది మందికిపైగా కంకర కిందే సమాధి అయ్యారు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. మృతుల్లో 18 మంది ప్రయాణికులు, ఇద్దరు బస్సు, టిప్పర్‌ డ్రైవర్లు ఉన్నారు. ఏడాది పాప సహా 11 మంది మహిళలు, 9 మంది పురుషులు మృతి చెందారు. 24 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

బస్సులో 70 మంది ప్రయాణికులు..
సోమవారం తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో, చేవెళ్ల మండలం, మీర్జాగూడ సమీపం వద్దకు చేరుకోగా, అటుగా వేగంగా వస్తున్న టిప్పర్ ఒక్కసారిగా బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బస్సులో 70 మంది వరకు ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో అక్కడికక్కడే 19 మంది దుర్మరణం చందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ దవఖానలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం…
సీఎస్, డీజీపీ మొదలు యావత్తు యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యింది. రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఇప్పటికే మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించడం జరిగింది. అదే విధంగా శాఖాపరమైన విచారణ కూడా ఆదేశించామని మంత్రులు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు, అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రమాద స్థలానికి వెళ్ళి పరిస్థితిని పర్యవేక్షించారు. చేవెళ్ల ఏరియా ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న బస్సు ప్రమాద ఘటన క్షతగాత్రులను పరామర్శించారు.

చెదిరిన కలలు, చెరిగిన జీవితాలు..
మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఉపాధి కోసం బయల్దేరిన కూలీలు, ఉద్యోగానికి వెళ్తున్న మరికొందరు, చదువు కొరకై వెళుతున్న విద్యార్థులు, రైలు మిస్ కావడంతో బస్ అందుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక్కో కథ, కల. కానీ అవన్నీ ఒక్క ప్రమాదంతో కల్లలయ్యాయి. కంకర టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు, అందరి జీవితాలకు రాళ్ల సమాధి కట్టింది.

కుటుంబాలను చిదిమేసిన కంకర..
చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలను రోడ్డున పడేసింది. టిప్పర్ రూపంలో కుటుంబాలను మృత్యువు కబళించింది. కుప్పలుగా మృతదేహాలను చేవెళ్ల ఆస్పత్రిలో చూసిన కుటుంబీకులు గుండెలు పగిలేలా ఏడ్చారు. మృతుల్లో చేవెళ్లకు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తల్లి ఒడిలో తనువు చాలించిన చిన్నారిని చూసి బంధువులు చలించిపోయారు. ఆస్పత్రి ఆవరణం శోకసంద్రంతో నిండిపోయింది.

నేతలపై స్థానికుల ఆగ్రహం…
చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంతో స్థానికులు, నాయకులపై మండిపడుతున్నారు. చాలా కాలంగా హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్న, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాల్సి ఉన్నా, ఎందుకు పూర్తి చేయలేదని, బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే యాదయ్యతో పాటు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, గత పాలకుల వాళ్లే, అమాయక కుటుంబాలు చిద్రమయాయాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు..

క్షతగాత్రులకు పరామర్శ..
సోమవారం చేవెళ్ల ఏరియా ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న బస్సు ప్రమాద ఘటన క్షతగాత్రులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఈ సందర్బంగా చేవెళ్ల ఏరియా ఆసుపత్రి దగ్గర మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ… ఇదొక దురదృష్టకర ఘటన. విషయం తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాని, బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం. మృతులకు రూ.7 లక్షల ఎక్స్ గ్రేషియాను అందించనున్నామని అన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మంత్రులు, అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. వాస్తవ పరిస్థితి, ప్రమాదం జరిగిన తీరును మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని తెలిపారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి..
మీర్జాగూడ బస్సు ప్రమాదానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. 2017లో ఈ రహదారికి కేంద్రం నిధులు సమకూరిస్తే అప్పటి ప్రభుత్వం సమయానికి భూ సేకరణ చేయలేదని ఆరోపించారు. రహదారి నిర్మాణానికి కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. ప్రస్తుతం కోర్టు కేసులు పూర్తయ్యాయని, ఏడాదిన్నరలో రోడ్డు పూర్తి కావొచ్చన్నారు.

విచారణకు ఆదేశం: మంత్రి పొన్నం..
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 21 చేరిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తొలుత 19 మంది చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారని పేర్కొన్నారు. మొత్తం మృతుల సంఖ్య 21కి చేరుకుందని తెలిపారు. మృతుల్లో పది మంది మహిళలు, రెండు నెలల చిన్నారి ఉన్నారని చెప్పారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించామని ఆయన వెల్లడించారు.

టిప్పర్ డ్రైవర్ కారణంగానే ప్రమాదం…
చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ కారణమని పోలీసులు గుర్తించారు. అతడు మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ అని వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లచ్చా నాయక్ దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. మెదక్ జిల్లా పటాన్ చెరువు క్రషర్ నుంచి వికారాబాద్ కు కంకర తీసుకెళ్తుండగా మీర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కూడా చనిపోయాడు.

మోడీ, రేవంత్ దిగ్భ్రాంతి..
తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్‌, డీజీపీని ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలికి వెళ్లి పర్యవేక్షించాలని కోరారు. క్షతగాత్రులకు తగిన వైద్యం అందించేందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం అదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారందరినీ కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని.. హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు

Latest