Mahaa Daily Exclusive

  తెలంగాణ మోడ‌ల్ పాల‌న అందిస్తాం ….బీహార్ ప్ర‌జ‌ల‌కు మంత్రి పొంగులేటి పిలుపు…

Share

  • ఎన్డీఏ కోటి వ‌రాల హామీలు బూట‌కం
  • ఒక్కసారి మ‌హాగ‌ఠ్ బంధ‌న్‌కు అవ‌కాశం ఇవ్వండి
  • తెలంగాణ మోడ‌ల్ పాల‌న అందిస్తాం
  • బీహార్ ప్ర‌జ‌ల‌కు మంత్రి పొంగులేటి పిలుపు
  • కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి బీహార్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి

పాట్నా, మహా : రెండు ద‌శాబ్దాల పాటు అవినీతి అక్ర‌మాలు అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌తో బీహార్ రాష్ట్రంలో అభివృద్ది కుంటుప‌డింద‌ని బీహార్ కాంగ్రెస్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఆరోపించారు. బీహార్ రాష్ట్రం ప‌శ్చిమ చంపార‌న్ జిల్లా చనుపటియా అసెంబ్లీ నియోజకవర్గం లో బుధవారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్డీయే కూట‌మికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని అందువ‌ల్లే అల‌వికాని హామీల‌ను ఇస్తుంద‌ని విమ‌ర్శించారు. వారి ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో కోటి వ‌రాలు ప్ర‌క‌టించ‌డం, యువ‌త‌కు కోటి ఉద్యోగాలు, కోటి మంది లక్‌ప‌తి దీదీలు హామీలు ఇచ్చార‌ని అధికారంలో ఉన్న ఈ 20 సంవ‌త్స‌రాల‌లో ఏన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత‌మంది దీదీల‌ను ల‌క్ ప‌తులుగా చేశార‌ని ప్ర‌శ్నించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ఎందుకు వీటిని అమ‌లు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.
బీహార్ ప్రజ‌ల‌ను కొత్త కొత్త హామీల‌తో మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. మ‌హాగ‌ఠ్ బంధ‌న్‌ను గెలిపిస్తే తెలంగాణ మోడ‌ల్ పాల‌న‌ను బీహార్‌లో అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అభివృద్ది, సంక్షేమానికి స‌మ ప్రాధాన్య‌త‌ను ఇస్తూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తోంద‌ని వివ‌రించారు. రైతుల‌కు రుణ‌మాఫీ, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌, రూ. 500 ల‌కే సిలిండ‌ర్‌, ఉచిత బ‌స్సు ప్రయాణం, అర్హులైన పేద‌లంద‌రికీ ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం వంటి హామీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని వివ‌రించారు. బీహార్ ప్ర‌జ‌లు ఈ సారి విజ్ఞ‌త‌తో ఆలోచించి మ‌హాగ‌ఠ్ బంధ‌న్‌కు అండ‌గా నిల‌వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మ‌హాగ‌ఠ్ బంధ‌న్‌ను గెలిపిస్తే యువ‌కుడైన తేజ‌స్వియాద‌వ్ ముఖ్య‌మంత్రి అవుతార‌న్నారు. ఏన్డీయే కూట‌మి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధి ఎవ‌ర‌న్న విష‌యాన్ని ప్ర‌క‌టించలేని దుస్ధితిలో ఉంద‌ని విమ‌ర్శించారు. ఈ సభలో బీహార్ రాష్ట్ర ఇంచార్జ్ కృష్ణ అల్వర్, ఎంజీబీ అభ్యర్తి అభిషేక్ రంజన్ తదితరులు  పాల్గొన్నారు

Latest