- బీఆర్ఎస్, కాంగ్రెస్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
- జూబ్లీహిల్స్ ప్యాలెస్, అసెంబ్లీ, గాంధీభవన్ ఎక్కడికి రమ్మన్నా వస్తా
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్
- రేవంత్ ప్రభుత్వం కనీసం రోడ్లపై పడిన గుంతలనైనా పూడ్చిందా అంటూ ఫైర్
- జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రగతి నివేదిక విడుదల చేసిన బీఆర్ఎస్ నేత
హైదరాబాద్, మహా: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధిపై, కాంగ్రెస్ అభివృద్ధికి చర్చకు సిద్ధమా..? జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్, అసెంబ్లీ, గాంధీభవన్ ఎక్కడికి రమ్మన్నా వస్తామని చర్చకు సిద్ధమా ? అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రగతి నివేదికను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఓటమి భయంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రేవంత్ సిద్ధమా? అంటూ ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో ఫ్లై ఓవర్లు, అండర్‌పాసులు నిర్మించామన్నారు. రేవంత్ ప్రభుత్వం కొత్తగా ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టిందని.. రేవంత్ ప్రభుత్వం కనీసం రోడ్లపై పడిన గుంతలనైనా పూడ్చిందా? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదెవరో ప్రజలందరికీ తెలుసునని, కాంగ్రెస్ హయాంలో మంచినీటి కష్టాలు మొదలయ్యాయన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా మార్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను మురికికూపంగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పవర్ హాలీడేలు విధించేవారని, కేసీఆర్ పాలనలో24గంటలు నాణ్యమైన కరెంట్ అందించామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.5328 కోట్లు ఖర్చు చేస్తే.. రెండేళ్ల రేవంత్ పాలనలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధిని చూపించి రేవంత్ ఓట్లు అడగాలని, గోపీనాథ్ వేసిన శిలాఫలకం జూబ్లీహిల్స్‌లో ఎక్కడికి పోయినా కనిపిస్తుందన్నారు. జూబ్లీహిల్స్‌లోని ప్రతీ ఇంటికీ ప్రగతి ప్రస్థాన నివేదికను పంపిస్తామన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో 34 అవార్డులు వచ్చాయని.. రేవంత్ పాలనలో ఎన్ని వచ్చాయని ప్రశ్నించారు. ప్రజలే న్యాయనిర్ణేతలని.. జూబ్లీహిల్స్‌లో సరైన జవాబిస్తారన్నారు. రేషన్‌కార్డుల పంపిణీని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్కువ ప్రచారం చేయలేదని, కాంగ్రెస్ అభివృద్ధి చేయలేక రేషన్‌కార్డులు ఇచ్చామని ప్రచారం చేశారన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధిపై, కాంగ్రెస్ అభివృద్ధికి చర్చకు సిద్ధమా? టైమ్, ప్లేస్ చెబితే ఎక్కడికైనా వస్తామన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్, అసెంబ్లీ, గాంధీభవన్ ఎక్కడికి రమ్మన్నా వస్తామని.. చర్చకు సిద్ధమా ? అంటూ సవాల్ విసిరారు








