Mahaa Daily Exclusive

  అధికార డీఎంకే నే తమ ప్రథమ శత్రువని స్పష్టం :టీవీకే చీఫ్ విజయ్

Share

  • ఏ పార్టీతో పొత్తుల్లెవ్
  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే
  • అధికార డీఎంకే నే తమ ప్రథమ శత్రువని స్పష్టం
  • స్పష్టం చేసిన టీవీకే చీఫ్ విజయ్

చెన్నై, మహా : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తమిళగ వెట్రి కజగం (టీవీకే) విజయ్ స్పష్టం చేశారు. టీవీకే పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకుంటుందని, ఏఐఏడీఎంకేతో కలిసి పోటీ చేస్తుందని వస్తున్న వార్తలకు ఈ ప్రకటనతో విజయ్ ఫుల్‌స్టాప్ పెట్టారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరిగిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కరూర్ తొక్కిసలాటకు ప్రభుత్వమే కారణమని, తమ రాజకీయ మొదటి ప్రత్యర్థి కూడా అధికార డీఎంకేనని చెప్పారు. కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన 38 రోజుల తర్వాత విజయ్ తొలిసారి బహిరంగంగా కనిపించారు. టీవీకేకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే అధికార పార్టీ “ప్రైవేట్ సైన్యాన్ని” ఏర్పాటు చేసిందని ఘాటుగా ఆరోపించారు.

టీవీకే తీర్మానాలు ఇవే

టీవీకే సర్వసభ్య సమావేశం 12 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. 2026 అసెంబ్లీ ఎన్నికలతో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌ పేరును ప్రకటించారు. శ్రీలంక నావికాదళం తమిళనాడు మత్స్యకారులను పదే పదే అరెస్టు చేయడాన్ని నిలిపివేయాలని, కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు మెరుగైన చర్యలు, ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ని నిలిపివేయాలని, విజయ్, టీవీకే కార్యక్రమాలకు తగిన పోలీసు భద్రత కల్పించాలని తీర్మానించారు.

విజయ్ తన ప్రసంగంలో స్టాలిన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆయన ‘రాజకీయ దురుద్దేశం’తో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ర్యాలీ సందర్భంగా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించిందని గుర్తుచేశారు. “భారతదేశంలో, ఏ రాజకీయ నాయకుడికీ ఇంత కఠినమైన నిబంధనలు పెట్టలేదు. ర్యాలీ సమయంలో బస్సులకే పరిమితం కావాలని, జనాలకు చేయి ఊపకూడదని, వాహనాలపైకి ఎక్కకూడదని ఇలా ఎన్నో కండీషన్లు పెట్టడం వెనక రాజకీయ దురుద్దేశం ఉంది’’ అని పేర్కొన్నారు

Latest