- ఫిట్‌నెస్ లేని వాహనాలను సీజ్ చేయాలి
- ప్రతి వాహనం ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్ కచ్చితంగా ఉండాలి
- అధికారులను ఆదేశించిన రోడ్డు భద్రతా కమిటీ
హైదరాబాద్, మహా: ఆర్టీసీ బస్సుల ఫిట్‌నెస్ మరోసారి తనిఖీ చేయాలని, వాటితో పాటు ఇతర బస్సులు, కమర్షియల్ వాహనాలను తనిఖీ చేసి ఫిట్‌నెస్ లేని వాహనాలను సీజ్ చేయాలని అధికారులను రోడ్డు భద్రతా కమిటీ ఆదేశించింది. చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ సమీక్ష నిర్వహించింది. సుప్రీంకోర్టు నియమించిన రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే, సభ్యులు సంజయ్ బందోపాధ్యాయ గురువారం హైదరాబాద్‌కు విచ్చేసి.. చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి గల కారణాలను కమిటీ అడిగి తెలుసుకుంది. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.. ప్రమాదం జరగడానికి గల కారణాలను కమిటీకి తెలియజేశారు. ప్రతి వాహనం ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి విస్తరణ పనులను తొందరగా చేపట్టి పూర్తి చేయాలని ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులకు సూచించారు. మైనింగ్ క్వారీల నుంచి పరిమితికి మించి లోడ్ వెళ్లకుండా చూడాలని మైనింగ్, రవాణా శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రత నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా కమిటీ సమావేశంలో రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మైనింగ్ డైరెక్టర్ భవేశ్ మిశ్రా, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, ఆర్టీసీ, ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులు పాల్గొన్నారు







