- మేడారం జాతరకు 4 వేల ఆర్టీసీ బస్సులు
- జనవరి 28 నుంచి 31 వరకు జాతర
- వై జంక్షన్‌లో కొత్త బస్టాండ్ నిర్మాణం
కరీంనగర్, మహా : దక్షిణాది కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు ప్రత్యేకంగా నాలుగు వేల బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. 2026, జనవరి 28 నుంచి 31 మేడారం జాతర జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జాతర కోసం సర్వ సిద్ధం చేస్తోంది. రోడ్ల అభివృద్ధి, భక్తులకు కావాల్సిన వసతులు కల్పించేందుకు ఇప్పటికే భారీగా నిధులు విడుదల చేసింది. భక్తుల కోసం ఏకంగా 4 వేల బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్, వరంగల్ ఆర్ఎండీ తెలిపారు. అలానే వై జంక్షన్‌లో కొత్త బస్టాండ్ నిర్మించిబోతున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలో వరంగల్ ఆర్ఎండీ, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్‌తో పాటు మరి కొందరు ఆర్టీసీ సిబ్బంది, సివిల్ ఇంజనీర్లతో కలిసి మేడారంలో పర్యటించారు. వనదేవతలను దర్శించుకున్న తర్వాత.. వై జంక్షన్‌లో కొత్తగా నిర్మించబోయే బస్టాండ్‌కు ఆర్టీసీ అధికారులు భూమి పూజ చేశారు. మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. సుమారు 4 వేల బస్సులను నడుపుతామని తెలిపారు. భక్తులు ప్రైవేటు వాహనాలు, బస్సుల్లో కాకుండా.. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సంస్థను ఆదరించాలని వారు కోరారు.
జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో పనులు వేగవంతం అయ్యాయి. అలానే మేడారం మహా జాతరలో 30 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు ములుగు డీఎంహెచ్ వో గోపాల్ రావు తెలిపారు. జాతరలో ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు కోసం అధికారులు స్థలాలను పరిశీలించారు. జాతరకు తరలి వచ్చే భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైద్య శిబిరాల్లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తామని చెప్పుకొచ్చారు. మెడిసిన్స్, బెడ్స్ అందుబాటులో ఉంచి భక్తులకు వైద్యం అందిస్తామన్నారు. అలానే భక్తుల కోసం సుమారు 1050 ఎకరాల్లో పార్కింగ్ స్థలం కేటాయించారు






