Mahaa Daily Exclusive

  వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన‌ ప్రధాని……

Share

  • వందేమాతరం అన్ని తరాలకు స్ఫూర్తి మంత్రం
  • జాతీయ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది
  • స్వాతంత్య్ర ఉద్య‌మంలో ఈ దేశ స్వ‌రంగా మారింది
  • వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన‌ ప్రధాని
  • స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన మోదీ

ఢిల్లీ, మహా: భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు జరిగే ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వందేమాతరం స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఈ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “నవంబర్ 7 ఒక చారిత్రకమైన రోజు. వందేమాతరం 150 ఏళ్ల మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ పవిత్ర సందర్భం కోట్లాది మంది భారతీయులలో కొత్త స్ఫూర్తిని, శక్తిని నింపుతుంది. వందేమాతరం అనేది కేవలం ఒక పదం కాదు, అది ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల, ఒక సంకల్పం. ఇది మనల్ని మన చరిత్రతో అనుసంధానిస్తుంది. మన ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మనం సాధించలేని కల ఏదీ లేదని గుర్తుచేస్తుంది” అని తెలిపారు. వందేమాత‌రం అంటే ఓ ప‌దం, ఓ మంత్రం, ఓ శ‌క్తి, ఓ క‌ళ‌, ఓ ప‌ట్టుద‌ల అని ఆయ‌న అన్నారు. భార‌త‌మాత ప‌ట్ల ఇది భ‌క్తికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. మ‌న చరిత్ర‌ను చాటుతూ.. మ‌న‌కు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంద‌న్నారు. అనుకున్నది సాధించ‌లేనిది ఏమీ లేద‌ని, భార‌తీయులు దేన్నైనా సాధించ‌గ‌ల‌ర‌ని, జ్ఞానం..విజ్ఞానం.. సాంకేతిక నిండిన దేశాన్నినిర్మించాల‌న్నారు.

గేయంలోని కొన్ని చ‌ర‌ణాల‌ను తొల‌గించారు..
భార‌త స్వాతంత్య్ర ఉద్య‌మంలో వందేమాత‌రం ఈ దేశ స్వ‌రంగా మారింద‌న్నారు. ప్ర‌తి భార‌తీయుడి త‌మ‌ మ‌నోభావాల‌ను ఆ గేయం ద్వార వ్య‌క్త‌ప‌రిచార‌న్నారు. కానీ 1937లో దుర‌దృష్ట‌వ‌శాత్తు, వందేమాత‌రం గేయంలోని కొన్ని చ‌ర‌ణాల‌ను తొల‌గించార‌ని, వందేమాతర గీత విభ‌జ‌న దేశ విభ‌జ‌న‌కు బీజం వేసింద‌న్నారు. జాతి నిర్మాణం కోసం రూపొందించిన ఈ మ‌హామంత్రం ప‌ట్ల ఎందుకు అన్యాయం జ‌రిగిందో ఈ త‌రం యువ‌త తెలుసుకోవాల‌న్నారు. ఇలాంటి విచ్చిన్న‌క‌ర మైండ్‌సెట్ దేశానికి ఇప్ప‌టికీ స‌వాలే అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చిన గీతాన్ని స్మరించుకోవడం గర్వంగా ఉందన్నారు. “ప్రాణత్యాగం చేసిన వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు చివరిగా పలికిన మాట వందేమాతరం అయి ఉంటుంది. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి భారతీయులందరినీ ఏకం చేయగల శక్తి వందేమాతరానికి ఉంది” అని ఆయన అన్నారు. పౌరులు తమ గళంతో వందేమాతరం పాడి పంపేందుకు ఒక డిజిటల్ పోర్టల్‌ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు