- గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక యాక్ట్
- 12న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం
- ఆమోదం తర్వాత బిల్లును అసెంబ్లీకి ప్రవేశపెడతాం
- మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి
హైదరాబాద్, మహా: గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఒక యాక్ట్ తీసుకురాబోతున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఈనెల 12న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం పొందనుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గిగ్ వర్కర్లు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గిగ్ వర్కర్ల బిల్లు రాహుల్ గాంధీ ఆలోచనల్లో భాగంగా తీసుకువస్తున్నామని తెలిపారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత బిల్లును అసెంబ్లీకి ప్రవేశపెడతామని, గిగ్ వర్కర్లకు కొత్త చట్టం ద్వారా భద్రత, హక్కులు, మరియు సామాజిక రక్షణ కల్పించబోతున్నాం అని చెప్పారు. కొత్త చట్టం ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి మార్పులు లేదా చేర్పులు అవసరమో కూడా ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తుందని అన్నారు. గిగ్ వర్కర్ల భవిష్యత్తు భద్రపరచడంతో పాటు వారికి స్థిరమైన హక్కులు అందించేందుకు చర్యలు తీసుకుంటాం అని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.







