- 2034 వరకు మాదే అధికారం
- అభివృద్ధి కోసం చంద్రబాబు, వైఎస్ విధానాలను ఫాలో అవుతున్నాం
- ఐటీ, ఫార్మా రంగాలను వారు ప్రోత్సహించారు
- ఐటీ రంగానికి పునాది వేసిన నేత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి
- కేటీఆర్ విమర్శలు సినిమాల్లో ఐటెం సాంగ్ లా ఉన్నాయి
- ఆదరించండి అభివృద్ధి చేస్తాం
- రైతులు, పేదలకు మేలు చేశాం
- రేండేళ్ళలో ఎన్నో చేశాం … చేయాల్సింది చాలా ఉంది
- ‘మీట్ ది ప్రెస్’ లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎంత త్యాగం చేసిందో ప్రజలందరికీ తెలుసని సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆయన గుర్తు చేశారు. పదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించగా.. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలి సంతకాన్ని ఉచిత సంతకం రైతులపై కేసుల మాఫీ, రూ.1300 కోట్ల రైతు వ్యవసాయ బిల్లుల బకాయిల రద్దుపై చేశారన్నారు. దాని ద్వారా వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేయాలని ఉచిత కరెంటును తీసుకొచ్చారన్నారు. తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. తుమ్మిడిహట్టి, ప్రాణహిత-చేవెళ్ల, ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల తదితర ప్రాజెక్టుల్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం జలయజ్ఞం ఆధ్వర్యంలో పదేళ్లు ప్రణాళికలు రచించి వేగంగా పూర్తి చేసేందుకు ఆనాటి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేసిందన్నారు. ఒకప్పుడు ఎండాకాలంలో మంచినీటికి తీవ్ర ఎద్దడి ఉండేదని, కృష్ణాజలాలను పి.జనార్థన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉండి హైదరాబాద్ కు తీసుకువచ్చారని తెలిపారు. ఇలాంటి చాలా పనులు ఆనాటి ప్రభుత్వాల హయాంలో జరిగాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరగడం వల్లే విభజనకు ఏపీ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. హైదరాబాద్ ఆదాయంలో కూడా వాటా అడిగారని సీఎం గుర్తు చేశారు. పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ అందించిందని తెలిపారు.
కాంగ్రెస్ వల్లే హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ గా మారింది
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించి పదేళ్లు పట్టం కట్టారన్నారు. పదేళ్ల తర్వాత ప్రజాపాలన వచ్చిందని, తమ రెండేళ్ల పాలనలో అనేక పనులు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రెండేళ్ల పాలనలో చేసిన పనులు కేసీఆర్ చెరిపేస్తే చెరిగిపోయేవి కాదన్నారు. పంటలకు కనీస మద్దతు ధరను తీసుకువచ్చి రైతులను కాపాడామన్నారు. కానీ గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షకోట్ల రూపాయల్ని కొల్లగొట్టిందని విమర్శించారు. నాలెడ్జ్ హబ్ గా హైదరాబాద్ మారిందనేందుకు కాంగ్రెస్ పాలసీనే కారణమన్నారు. నేడు హైదరాబాద్ కు దిగ్గజ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్, నీళ్లు ఇవ్వడం ద్వారా సాధ్యమైందన్నారు. దేశంలోని గ్లోబల్ కంపెనీల్లో 70 శాతం కంపెనీలు హైదరాబాద్ లోనే ఉన్నాయన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని, ఆ అప్పు కడుతూనే సంక్షేమ పథకాల అమలుతో పాటు ఇతర పనులు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలసీలే తెలంగాణ గ్రోత్ ఇంజిన్ లుగా మారాయని పేర్కొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ పథకాలను కొనసాగిస్తూ అదనంగా అనేక కొత్త పథకాలు తీసుకువచ్చామని సీఎం తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఎవరూ చేయని సాహసం చేశానన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపానని, దేశంలో ఎవరూ చేయని కులగణనను తెలంగాణలో చేసి చూపించానని గుర్తుచేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించానన్నారు. ప్రజాపాలన ప్రారంభమై రెండేళ్లు గడిచిందని, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి 4 కోట్ల ప్రజలకు ఇచ్చిందన్నారు. మహానగర అభివృద్ధి కోసం చంద్రబాబు, వైఎస్ తీసుకున్న నిర్ణయాలు కొనసాగిస్తున్నామన్నారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిన ఫార్మా రంగం హైదరాబాద్‌లోనే ఉందన్నారు. నాలుగు రకాలుగా రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న అప్పులు రూ.6.71 లక్షల కోట్లు అని తేల్చి చెప్పారు. రూ.1.29 లక్షల కోట్ల అప్పులకు ఎలాంటి పత్రాలు లేవని, తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటికి రూ.8 లక్షల కోట్ల అప్పు చూపారని వివరించారు.
వ్యవసాయానికి రైతులను కేసీఆర్ దూరం చేశారు
“రెండేళ్లలో 2.85 కోట్ల వడ్లను ఉత్పత్తి చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్లలో వీసీలను నియమించారా? రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసింది మీరు కాదా? వైఎస్, చంద్రబాబు అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నాం. హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా రంగాలను గత పాలకులు ఎంతో ప్రోత్సహించారు. జీసీసీలు, డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్‌గా మారింది. దేశానికి వచ్చిన జీసీసీలు, డేటా సెంటర్లలో 70 శాతం హైదరాబాద్‌కే వచ్చాయి. ఎన్.జనార్దన్‌రెడ్డి పునాది వేసిన ఐటీ రంగం హైదరాబాద్ అభివృద్ధికి కీలకంగా మారింది.” అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ హయాంలో వచ్చిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్ కూడా కీలకంగా మారాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సీఎంల నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశాయన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయని చెప్పారు. ప్రపంచాన్నే శాసించే సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. అభివృద్ధి మాత్రమే కాదు, సంక్షేమ రంగంలోనూ కాంగ్రెస్ పాలకులు తమదైన ముద్ర వేశారన్నారు. 2004-2014 మధ్య కాంగ్రెస్ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండి హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసిందని సీఎం పేర్కొన్నారు.
కేటీఆర్ ఎన్నికల ప్రచారం పుష్ప సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్‌ను గుర్తుకు తెస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం లేకుండానే తమ ప్రభుత్వం అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిందన్నారు. రెండు సీజన్లలో 2.85 లక్షల ధాన్యం ఉత్పత్తి చేశామన్నారు. కేసీఆర్ పదేళ్లలో రూ. 20 లక్షల కోట్ల ద్వారా ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలకులు ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? ఒక్క పాఠశాలైనా కట్టారా? మహిళలకు అధికారం దక్కిందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించిన వాడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడన్నారు. ధృతరాష్టుడు కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు కెసీఆర్ వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
బెదరిస్తే అదరం
ఈ సందర్భంగా ప్రైవేట్ కాజీల బంద్ పై సీఎం రేవంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను బెదిరించడానికే కాలేజీలను బంద్ చేశారన్నారు. ఆరు నెలల పాటు బంద్ చేస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించారు. విద్య వ్యాపారం కాదని.. సేవ అని అన్నారు. ఫీజులు ఇస్తారా లేదా అని బంద్ చేయించి బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంతాలు, పట్టింపులకు పోతే సమస్య పరిష్కారం కాదన్నారు. రూల్స్ ప్రకారం వెళదామంటే చెప్పండి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. 100 శాతం రూల్స్ పాటించే కాలేజీలకు తక్షణమే బకాయిలు ఇస్తామని స్పష్టం చేశారు. బీఆరెస్ హయాంలో ఒక్క కొత్త యూనివర్సిటీనైనా తీసుకొచ్చారా.. కనీసం వీసీలను నియమించలేదన్నారు. 5 వేల పాఠశాలలు మూసేశారన్నారు.
నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించాం
మా ప్రభుత్వంలో 7100 కోట్లు ఉచిత బస్సు కోసం ఖర్చు చేశామని, ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల వైపు నడిపించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచామని, రూ. 3 వేల కోట్లతో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మిస్తున్నామని, వీటన్నింటితో పాటు పాత పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ, రూ. 500 లకే గ్యాస్ సిలెండర్ అందించడం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతు రుణ మాఫీ కోసం రూ. 21 వేల కోట్లు వెచ్చించామని, తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించామన్నారు. కెసీఆర్ ప్రారంభించిన ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశామని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. కేసీఆర్ పదేళ్ళ పాలనలో హైదరాబాద్ కు తాగు నీటిని అెందించేందుకు కొత్త పైప్ లైన్ కానీ, రిజర్వాయర్ కానీ నిర్మించిన పాపాన పోలేదని, మేం వచ్చాక 20 టీఎంసీల గోదావరి జలాలు తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు.
గుజరాత్ కా గులాం కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాం గా మారారని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాషఅట్ర ప్రజలు తనను ఓట్లేసి గెలిపించారన్న విశ్వాసం కూడా లేకుండా కిషన్ రెడ్డి వ్యవరిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేటీఆర్ ను సొంత చెల్లి వదిలేసి వెళ్లిపోయిందని, అలాంటి కేటీఆర్ తో కిషన్ రెడ్డికి దోస్తానా ఏందన్నారు. ఎవరిది అగ్రికల్చర్, ఎవరిది డ్రగ్స్ కల్చర్ అనేది ప్రజలే ఆలోచించాలన్నారు.
ఎవరిది పబ్ కల్చర్.. ఎవరిది సామాన్యులతో కలిసే కల్చరో గుర్తించాలని కోరారు. సినీ తారలతో తిరిగే కల్చర్ ఎవరిది, సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్ మీరు ఆలోచించండననారు. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. ప్రాధాన్యత వారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాపై ఉందన్నారు. జూబ్లీహిల్స్ గెలవాల్సిందే అభివృద్ధి జరగాల్సిందేనని అన్నారు.






