- మోదీ సామ్రాజ్యంపై మా పోరాటం
- బ్రిటిషర్లపై గాంధీజీ చేసిన యుద్ధం లాంటిదే ఇది
- కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాట్ కామెంట్స్
బీహార్, మహా: ప్రధాని నరేంద్ర మోదీ సామ్రాజ్యంపై తమ పార్టీ చేస్తున్న పోరాటం ఒకప్పుడు మహాత్మా గాంధీ బ్రిటిషర్లపై చేసిన స్వాతంత్ర్య సంగ్రామం లాంటిదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సీమాంచల్ ప్రాంతంలోని కతిహార్, పూర్నియా, బరారీలలో నిర్వహించిన సభల్లో ఆమె ప్రసంగించారు.ప్రధాని మోదీ ‘కట్టా’ (నాటు తుపాకీ) వంటి పదాలు వాడటంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఒకవైపు అహింసకు ప్రతీక అయిన ‘వందే మాతరం’ అంటూనే, మరోవైపు తన పదవి గౌరవానికి భంగం కలిగించేలా ప్రధాని మాట్లాడుతున్నారు. ఇది ఆయన హోదాకు తగదు” అని ప్రియాంక విమర్శించారు. బీహార్‌లోని ప్రస్తుత దుస్థితికి ఎన్డీయే ప్రభుత్వమే కారణమని ప్రియాంక ఆరోపించారు. “రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని తప్పుగా అమలు చేయడం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుప్పకూలిపోయి ఉద్యోగాలు లేకుండా పోయాయి” అని ఆమె అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రధాని మోదీ తన ఇద్దరు కార్పొరేట్ మిత్రులకు కట్టబెడుతున్నారని ఆమె ఆరోపించారు.







